Kadapa: చాలా యేళ్ల తర్వాత జగన్ రెడ్డి హయాంలో అక్కడ సీన్ రివర్స్.. హంగామా చేసిన టీడీపీ నేతలు..!

ABN , First Publish Date - 2023-03-27T12:18:03+05:30 IST

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వైఎస్‌ కుటుంబానికి పెట్టని రాజకీయ కంచు కోట. దశాబ్దాల నుంచి కడప పార్లమెంట్‌ సహా పులివెందులలో...

Kadapa: చాలా యేళ్ల తర్వాత జగన్ రెడ్డి హయాంలో అక్కడ సీన్ రివర్స్.. హంగామా చేసిన టీడీపీ నేతలు..!

పులివెందుల టీడీపీ నేతలకు...ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసొస్తున్నాయా...? అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు వెనుతిరిగిచూడడం లేదా... ? పులివెందుల పూలంగళ్ల సర్కిల్లో పసుపు జెండాను రెపరెపలాడిస్తామని చంద్రబాబు చేసిన శపథానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది కానున్నాయా.. అసలు పులివెందులలో ఏమ్ జరుగుతోంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1402.jpg

వైఎస్‌ కుటుంబానికి పులివెందుల పెట్టని కోట

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వైఎస్‌ కుటుంబానికి పెట్టని రాజకీయ కంచు కోట. దశాబ్దాల నుంచి కడప పార్లమెంట్‌ సహా పులివెందులలో వైఎస్‌ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసివస్తున్నాయి. ఈ విషయం.... ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌రెడ్డి బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్‌ రవి విజయం సాధించారు. పులివెందుల చరిత్రలోనే వైఎస్ కుటుంబీకులపై గెలిచిన ఏకైన వ్యక్తిగా బీటెక్‌ రవి చరిత్ర సృష్టించాడు. సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాడు.

Untitled-138.jpg

చంద్రబాబుతో శభాష్‌ అనిపించుకున్న రామ్‌గోపాల్‌ రెడ్డి

తాజాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ...పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. పులివెందులకు చెందిన టీడీపీ నేత మరోసారి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటారు. ఉత్కంఠ పోరులో నిలిచి గెలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నారు. పార్టీ నేతల ప్రశంసలు పొందారు.

Untitled-11015.jpg

పులివెందుల వీధుల్లో సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన జెండాలు, బ్యానర్లు వెలిసేవికావు. ఇతరపార్టీల జెండాలు, ఫెక్ల్సీలు, పోస్టర్లు కనిపించేవే కావు. చాలా యేళ్ల తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో అక్కడ సీన్ రివర్స్ అయింది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి గెలిచిన రోజున...పులివెందుల వీధుల్లో తొలిసారిగా టీడీపీ నేతలు భారీగా సంబరాలు చేసుకున్నారు. తెగ హంగామా చేశారు.

Untitled-1058.jpg

వచ్చే ఎన్నికల్లో జగన్‌ మెజారిటీ పడిపోయే అవకాశం

జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.... ఆయన సొంత నియోజకవర్గంలో.... పసుపు దళం ఇంత హంగామా చేయడంపై...అక్కడి ప్రజలు ముక్కునవేలేసుకున్నారట.... ఎంతగానో ఆశ్చర్యపోయారట..మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డి సొంత ఓటు బ్యాంకు కూడా చీలిపోయిందని ప్రచారం జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్‌గోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్లను చూస్తే అదే అర్థమవుతోంది. పులివెందుల నియోజకవర్గంలో పట్టభద్రులకు సంబంధించి సుమారు 10 వేల 500 వరకు ఓట్లున్నాయి. ఇందులో ఏడు వేలకుపైగా పోలయ్యాయి. పోలైన ఓట్లలో సమారు 4 వేలఓట్లు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డికే దక్కాయి.

Untitled-12588.jpg

అంటే పులివెందుల ప్రజల్లో చాలా మార్పు వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే 7,500 ఓట్లకు .....4 వేల ఓట్లు వచ్చాయంటే పులివెందుల్లో జగన్ రెడ్డి సొంత ఓటు బ్యాకు ఏమాత్రం చీలిపోయిందో అర్ధం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది జగన్‌ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే... మిగతా నియోజకవర్గాలల్లో పరిస్థితి ఏంటన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ రెడ్డి మెజారిటీ భారీగా పడిపోవడం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Untitled-1648.jpg

తిరిగిరాస్తున్న పులివెందుల నియోజకవర్గం టీడీపీ నేతలు

టీడీపీ అభ్యర్థికి పడ్డ ఎమ్మెల్సీ ఓట్లను చూసి పులివెందుల నియోజకవర్గంలో...జగన్ రెడ్డి సొంత ఓటర్లలో ఇంత మార్పువచ్చిందా అని చర్చించుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పులివెందుల్లో వైసీపీ పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పులివెందుల వారికే అవకాశం ఇవ్వడం వారు విజయాలు సాధిస్తుండడం టీడీపీకి కలిసివస్తోంది. మొత్తానికి జగన్ రెడ్డి కుటుంబం పొలిటికల్‌ చరిత్రను పులివెందులకు చెందిన టీడీపీ నేతలే తిరిగిరాస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డినే ఓడించి బీటెక్‌ రవి హీరోగా నిలిస్తే... నేడు రామ్‌గోపాల్‌ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి...పులివెందుల పొలికేకను వినిపించారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు పులివెందుల టీడీపీ నేతలకు అన్నవిధాలా కలిసివస్తున్నాయి.

Updated Date - 2023-03-27T12:20:02+05:30 IST