Pattiseema: జగన్ సర్కారు నోట.. చంద్రబాబు ప్రాజెక్టు మాట..!!

ABN , First Publish Date - 2023-07-20T17:50:55+05:30 IST

అనూహ్యంగా జగన్ సర్కారు నోట చంద్రబాబు ప్రాజెక్టు మాట వినిపించింది. ఈ మేరకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని.. కొన్నిరోజుల్లో ఈ వరద 8 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీంతో నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Pattiseema: జగన్ సర్కారు నోట.. చంద్రబాబు ప్రాజెక్టు మాట..!!

ఏపీ(Andhra Pradesh)లో జగన్ ప్రభుత్వం (Jagan Government) అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు (Chandrababu) హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజావేదికను కూల్చివేసిన జగన్ సర్కారు అన్నా క్యాంటీన్‌లకు వైసీపీ రంగులు వేసి నిరుపయోగంగా పడేసింది. అయితే గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేస్తూ టీడీపీ ప్రభుత్వం (TDP Government) పట్టిసీమ (Pattiseema) ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. 2016లో ఈ ప్రాజెక్టును అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి రికార్డు స్థాయిలో ఏడాది సమయంలో పూర్తి చేసింది. పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోని నీటిని పంపింగ్ చేసి పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా డెల్టాలోని రైతులకు అందించవచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి చేరుతుంది. కానీ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టిసీమ ప్రాజెక్టును పట్టించుకోలేదు.

అయితే అనూహ్యంగా జగన్ సర్కారు నోట చంద్రబాబు ప్రాజెక్టు మాట వినిపించింది. ఈ మేరకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పట్టిసీమ ద్వారా మళీ కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పోటెత్తింది. దీంతో పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. కొన్నిరోజుల్లో ఈ వరద 8 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా వేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నీటిని పులిచింతల ప్రాజెక్టులో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కృష్ణా నది ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. తద్వారా నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా కూడా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయితే కొత్తది నిర్మించాలా లేదా పాత డయాఫ్రమ్ వాల్‌కే మరమ్మతులు చేయాలా అన్నది అధికారులతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర జల సంఘానికి ఇంకా నివేదిక ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

కాగా గోదావరి తీరంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంంగా ఏపీలోని గోదావరిలో కూడా వరద ఉధృతి కూడా పెరుగుతోంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి:

Weather Politics: వాతావరణానికి, రాజకీయాలకు సంబంధం ఉందా?

AP Politics: పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఆ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?

Updated Date - 2023-07-20T17:50:55+05:30 IST