Karnataka Election result: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పుడిదే హాట్ టాపిక్!.. అసలు తెలంగాణతో ఈ లింక్ ఏమిటి?

ABN , First Publish Date - 2023-05-11T21:12:02+05:30 IST

నిజానికి కర్ణాటక ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ... ప్రత్యేకించి తెలంగాణలో (Telangana) ఇంకాస్త ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఒక ఆసక్తికరమైన డిబేట్ కూడా ప్రారంభమైంది. అదేంటంటే...

Karnataka Election result: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పుడిదే హాట్ టాపిక్!.. అసలు తెలంగాణతో ఈ లింక్ ఏమిటి?

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election results) శనివారం వెలువడనున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit polls) అన్నీ కాంగ్రెస్ వైపే (Congress) మొగ్గుచూపాయి. ఒకటి రెండు పోల్స్ మాత్రమే బీజేపీకి (BJP) ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. జేడీఎస్ (JDS) కూడా గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని లెక్కలు వేశాయి. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్‌ను విశ్లేషిస్తే హంగ్ ఏర్పడినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఈ కారణంగానే కన్నడిగుల తీర్పు ఎలా ఉండబోతోంది?, అక్కడ గద్దెనెక్కే పార్టీ ఏది?, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే మరికొన్ని గంటల్లోనే దీనికి తెరపడనుంది. నిజానికి కర్ణాటక ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ... ప్రత్యేకించి తెలంగాణలో (Telangana) ఇంకాస్త ఎక్కువ ఆసక్తి నెలకొంది. కన్నడ తీర్పు రాబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, అక్కడి ఫలితమే ఇక్కడ ప్రతిబింబిస్తుందంటూ మొదటి నుంచి డిబేట్ నడిచింది. ఫలితాల ముందు ఈ చర్చ మరింత జోరందుకుంది. మరి ఇందుకు కారణాలు ఏమిటి? నిజంగా అక్కడి ఫలితం ఇక్కడ పార్టీలను ప్రభావితం చేస్తుందా?. కర్ణాటక ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలను ముడివేయడం దేనికి? అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో చూద్దాం..

కర్ణాటక ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత.. అంటే ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు (Telangana Assembly polls) జరగబోతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రం తెలంగాణయే. అక్కడి పరిస్థితులు ఇక్కడి పరిస్థితులు ఒకే మాదిరిగా ఉంటాయని, అక్కడాఇక్కడా ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొనడం, అందునా బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, Congress) బరిలో ఉండడం ఈ చర్చకు ఆజ్యం పోసిన ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అక్కడ ఫలితమే ఇక్కడ ప్రతిబింబిస్తుందనే చర్చ ఇందులో భాగమే. కన్నడనాట కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు సానుకూలమవుతుందని... ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ బీజేపీకి మైలేజ్ లభిస్తుందని... బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని ఇలా రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఏ పార్టీకి సానుకూలం?.. ఏ పార్టీకి ప్రతికూలం? అనే చర్చలో అర్థంలేదని, హేతుబద్ధత కొరవడిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికార పార్టీగా.. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల బరిలో తలపడ్డాయని గుర్తుచేసుకోవాలంటున్నారు. అక్కడ పార్టీలను ఇక్కడ పరిస్థితులతో ముడిపెట్టడం అర్థవంతంగా లేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు విపక్ష పార్టీలుగా ఉన్నాయని, బీఆర్‌ఎస్ అధికార పార్టీ అనే విషయాన్ని మరచిపోకూడదంటున్నారు. కర్ణాటకలో జేడీఎస్ ప్రభావవంతమైన పార్టీగా ఉన్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్‌తో సరిపోల్చలేమంటున్నారు. ఇక బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్న మాట వాస్తవమే గానీ అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి చేరుకుందని చెప్పలేమంటున్నారు. నిజానికి ఈసారి ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడమే బీజేపీ లక్ష్యమని టాక్ వినిపిస్తోంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులకు స్థైర్యం వస్తుందని, ఎన్నికల బరిలో ఉత్సాహంగా పోరాడేందుకు పనికొస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం తెలంగాణ ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయడంలో సందేహం లేదు. మరి శనివారం ఫలితం వచ్చాక పార్టీలు ఏవిధంగా వర్ణిస్తాయో వేచిచూడాలి.

Updated Date - 2023-05-11T21:12:02+05:30 IST