TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

ABN , First Publish Date - 2023-05-26T23:05:17+05:30 IST

అవును.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో (TS Politcs) స్క్రిప్ట్‌లు మారిపోతున్నాయ్. ఏ పార్టీలో అయితే తమకు అనుకూలంగా ఉంటుందో.. ఏ పార్టీ అయితే టికెట్ హామీ ఉంటుందో అక్కడికి చేరిపోతున్నారు..

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

అవును.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో (TS Politcs) స్క్రిప్ట్‌లు మారిపోతున్నాయ్. ఏ పార్టీలో అయితే తమకు అనుకూలంగా ఉంటుందో.. ఏ పార్టీ అయితే టికెట్ హామీ ఉంటుందో అక్కడికి చేరిపోతున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేశారు. మరీ ముఖ్యంగా కన్నడనాట ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్‌ (Congress) గెలుపొందడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సీన్ మారిపోయింది. కర్ణాటకలో గెలవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. దీంతో కార్యకర్తలు, నేతలు యమా జోష్‌లో ఉన్నారు. కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఎన్నికలు జరగబోతున్నాయ్. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్‌ను గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందుకే 2014, 2018 ఎన్నికల సమయంలో పార్టీ మారిన కాంగ్రెస్ నేతలందర్నీ తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొందరు కీలక నేతలు బీఆర్ఎస్, బీజేపీ (BRS, BJP) నుంచి బయటికొచ్చేసి తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. తాజాగా మెదక్ జిల్లాకు (Medak District) చెందిన కీలక నేత సొంతగూటికి చేరుకున్నారు. ఇంతకీ ఎవరాయన..? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..? ఎందుకు మళ్లీ సొంత గూటికి వచ్చారనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

WhatsApp Image 2023-05-26 at 6.53.00 PM.jpeg

ఇంతకీ ఎవరా కీలక నేత..!?

ఆ కీలక నేత ఎవరో కాదండోయ్.. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి (Patlolla Shashidhar Reddy). శుక్రవారం నాడు గాంధీ భవన్ వేదికగా శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక నేత డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ మట్టా రాగమయి కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి కాంగ్రెస్ పెద్దలు పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ చేరిక కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేష్ శెట్కర్‌, కోదండరెడ్డితో పాటు స్థానిక, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. శశిధర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉంది. శశిధర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి 1989 నుంచి 1994 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా శశిధర్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సేవలందించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీలో శశిధర్ రెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగారు. అయితే.. 2009 ఎన్నికల్లో పోటీచేయగా ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విజయశాంతి అలియాస్ రాములమ్మకు అధిష్టానం ఇవ్వగా పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో శశిధర్ రెడ్డే.. రాములమ్మ ఓటమికి కారణమయ్యారని ఆరోపణలు రావడంతో దీన్ని అవమానంగా భావించిన పట్లోళ్ల కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి కమలం పార్టీలో చేరారు.

BJP-To-Congress.jpg

బీజేపీకి రాజీనామా ఎందుకో..!?

ప్రస్తుతం రాములమ్మ కూడా బీజేపీలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతి పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటే తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కానీ.. ఒకవేళ అధిష్టానం ఇవ్వాలనుకున్నా విజయశాంతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనివ్వరని పట్లోళ్ల భావించారట. అందుకే ఇక బీజేపీకి బై బై చెప్పేసి సొంత గూటికి చేరాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈయన బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. మనసు మార్చుకున్నారు. అయితే.. టికెట్ హామీతోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. శశిధర్ రెడ్డి చేరిక నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ కాంగ్రెస్ ప్లస్ అవుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. అయితే.. ఈ చేరికపై తిరుపతిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో తిరుపతి రెడ్డి ఉన్నారని సమాచారం. కాగా ఈ చేరికలపై రేవంత్ స్పందిస్తూ.. ‘బీఆర్ఎస్‌తో ఉంటే గెలుపు కష్టం - బీజేపీతో ఉంటే బ్రతుకు శూన్యం’ అని కాంగ్రెస్‌కు జై కొడుతున్నారని ట్వీట్ చేశారు.

Patlolla.jpg

మొత్తానికి చూస్తే.. కన్నడనాట కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో పార్టీకి మంచి రోజులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ చెందిన అగ్రనేత ఒకరు తెలంగాణలో కాంగ్రెస్‌దే రెండో స్థానమని బల్లగుద్ది మరీ చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో మరింత జోష్ పెరిగింది. ఎన్నికలకు ముందే ఇలాగుంటే.. దగ్గరపడే కొద్ది బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి నేతలు, టికెట్ దక్కని నేతలు పెద్ద ఎత్తున చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. పార్టీలో చేరిన నేతలకు ఏ మాత్రం టికెట్లు ఇస్తుందో.. ఉన్న నేతలను ఏమాత్రం అధిష్టానం సంతృప్తి పరుస్తుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

Updated Date - 2023-05-26T23:21:19+05:30 IST