Share News

TPAD: డాలస్‌ను మురిపించిన 'టీపాడ్‌' సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు

ABN , First Publish Date - 2023-10-28T13:19:23+05:30 IST

డాలస్‌ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌).. ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది.

TPAD: డాలస్‌ను మురిపించిన 'టీపాడ్‌' సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు

12వేల మందితో సంబరాలు

ప్రత్యేక ఆకర్షణగా సినీ కథానాయిక సంయుక్తా మీనన్

TPAD: డాలస్‌ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌).. ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను కలిపి ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్‌లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు 'టీపాడ్‌' బృందం తెలిపింది. ఫౌండేషన కమిటీ చైర్‌ రఘువీర్‌ బండారు, బీవోటీ చైర్‌ సుధాకర్‌ కలసాని, ప్రెసిడెంట్‌ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్‌ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో సద్దుల బతుకమ్మకు దసరా పండగ తోడవడంతో మగువలతో పాటు మగవారూ ఉత్సాహంగా, కలర్‌ఫుల్‌గా కనిపించారు.

BBBBBB.jpg

సందడి చేసిన సంయుక్తా మీనన్

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేడుకల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఔత్సాహికుల భాగస్వామ్యంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. నిర్దేశిత సమయానికి గంట ముందే వచ్చిన తెలుగు, తమిళ సినిమాల కథానాయిక సంయుక్తా మీనన్ ప్రతి బృందంతో కలిసి బతుకమ్మ ఆడుతూ కార్యక్రమానికి మరిన్ని వన్నెలద్దారు. తొలిసారే అయినా.. ఆమె అందరితో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడడం తెలుగు మహిళలందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. అనంతరం అదే వేదికపై దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్‌బలయ్‌ తీసుకున్నారు.

BBBB.jpg

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన

అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్‌బంప్స్‌ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. రోజంతా సాగిన సంబరాలతో అలసిపోయిన ప్రతి ఒక్కరిని ఓలలాడించేందుకే అన్నట్టు భారత నుంచి ప్రత్యేకంగా వచ్చిన గాయకులు సమీర భరద్వాజ్‌, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు.

BB.jpg

జాతరను తలపించిన కొమెరికా సెంటర్‌

కార్యక్రమంలో భాగంగా బైక్‌ రాఫెల్‌, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్‌ రాఫెల్‌ను సినీనటి సంయుక్తా మీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్‌ బూత్స్ ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్‌లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మెటల్‌ డిటెక్టర్‌లతో ప్రతి బ్యాగ్‌ను స్కాన్ చేసి పంపించారు. టీపాడ్‌ తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంత వైభవంగా సాగేందుకు కారణమైన స్పాన్సర్లతో పాటు నటి సంయుక్తా మీనన్ విచ్చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

BBBBB.jpgB.jpg

Updated Date - 2023-10-28T13:19:23+05:30 IST