TANA: 'తానా' ఆదరణ కింద.. మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ..!

ABN , First Publish Date - 2023-09-02T11:04:33+05:30 IST

తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్‌.వి.ఎస్‌ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా అందజేశారు.

TANA: 'తానా' ఆదరణ కింద.. మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ..!

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి' వెల్లడించారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవాసహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. గురువారం సాయంత్రం బెంజిసర్కిల్‌ సమీపంలోని ఎస్‌.వి.ఎస్‌ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌' ఆర్ధికసహాయంతో 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా అందజేశారు. అలాగే రాఖీ పండుగను పురస్కరించుకుని గద్దె రామ్మోహన్‌ తన సొంత నిధులతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

NRI-2.jpg

ఈ సందర్భంగా 'శశికాంత్‌ వల్లేపల్లి' మాట్లాడుతూ తెలుగురాష్ట్రాలోని ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది కూడా ఐ-క్యాంపులు, మెడికల్‌ క్యాంపులతో పాటు రవి సామినేని సహకారంతో ఆదరణ ద్వారా అనేక మందికి ట్రై సైకిల్స్‌‌ను అందజేసినట్లు తెలిపారు. విజయవాడలో గద్దె రామ్మోహన్‌ వేలాది మందికి సేవా కార్యక్రమాలను చేస్తున్నారని, ఆయన సేవలకు తోడ్పాటు అందించేందుకు 'పుట్టగుంట సురేష్‌' రూ.6 లక్షల 50 వేలతో కుట్టు మిషన్లు అందజేశారన్నారు.

NRI-3.jpg

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు 'తానా' ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. జన్మభూమికి సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో 'తానా' పనిచేస్తోందన్నారు. 'తానా' వారు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక మంది పేదలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, అలాగే వైద్య ఖర్చులు అందిస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 'పుట్టగుంట వీరభద్రరావు' జ్ఞాపకార్ధం ఇంత పెద్దఎత్తున కుట్టుమిషన్లు అందజేసిన 'పుట్టగుంట సురేష్‌' కు 'తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌'‌కు నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, పుట్టగుంట రమేష్‌, చెన్నుపాటి కాంతిశ్రీ గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, రాయి రంగమ్మ, నందిపాటి దేవానంద్‌, ఎం.దేవేంద్ర, రత్నం రమేష్‌, చిప్పాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-02T11:04:33+05:30 IST