Share News

NRI: అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి రేసులో తెలుగుతేజం

ABN , First Publish Date - 2023-11-08T06:48:32+05:30 IST

అమెరికాలో తెలుగు విద్యార్థి నిహాల్ అంతర్జాతీయ శాంతి బహుమతి రేసులో ముందున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ కిడ్స్ రైట్స్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి తుది పోటీదారులను ప్రకటించింది.

NRI: అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి రేసులో తెలుగుతేజం

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు విద్యార్థి నిహాల్ అంతర్జాతీయ శాంతి బహుమతి రేసులో ముందున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ కిడ్స్ రైట్స్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి తుది పోటీదారులను ప్రకటించింది. ఇందులో అమెరికాలో పర్యావరణ మేలు కోసం బ్యాటరీ రీసైకిల్ ద్వారా కృషి చేస్తున్న తెలుగు విద్యార్థి తుది జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ పోటీలో ముఖ్యంగా ముగ్గురు ఫైనలిస్టులను కిడ్స్ రైట్స్ సంస్థ ప్రకటించింది. ఈ ముగ్గురు ఫైనలిస్టులో ఒక్కో విధంగా సమాజానికి సేవలందిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సోఫియా తెరెష్‌చెంకో, అనస్తాసియా ఫెస్కోవా, అనస్తాసియా డెమ్‌చెంకో అనే ముగ్గురు బాలికలు శరణార్థుల పిల్లలకు సాయం అందిస్తున్నారు. ఆరోన్ స్కార్త్ అని బ్రిటన్‌కి చెందిన విద్యార్థి.. ఖైదీల పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇక మన తెలుగు బిడ్డ శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం వినూత్నంగా ఆలోచించి రీసైక్లింగ్ మై బ్యాటరీ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా వేల బ్యాటరీలను రీసైకిల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీ నిహాల్ తమ్మన స్థాపించిన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యులు ఒక్క రోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి గిన్నీస్ రికార్డు సాధించారు. పర్యావరణ మేలు కోసం శ్రీ నిహాల్ చేస్తున్న కృషిని గుర్తించిన కిడ్స్ రైట్స్ సంస్థ తాజాగా అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి రేసులోకి నిహాల్‌కి కూడా స్థానం కల్పించింది. నవంబర్ 17న తుది జాబితాలో ఉన్న ముగ్గురిలో ఒక్కరికి అంతర్జాతీయ శాంతి బహుమతి దక్కనుంది. ఈ బహుమతి ద్వారా లక్ష పౌండ్లు విజేతకు కిడ్స్ రైట్స్ సంస్థ అందిస్తుంది. ఈ మొత్తంలో సగం సామాజిక సేవకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Sri.jpg

శ్రీ నిహాల్ తమ్మన ప్రస్థానం ఇది..

10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్‌కు పంపిస్తున్నాడు.

రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది..

2019లో రీసైకిల్ మై బ్యాటరీ (ఆర్ఎంబీ) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్‌సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్‌ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్ఎంబీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్‌లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది.

Updated Date - 2023-11-08T06:49:50+05:30 IST