Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

ABN , First Publish Date - 2023-07-12T08:04:30+05:30 IST

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) నివాసితులు, ప్రవాసులను సోమవారం వార్న్ చేసింది.

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) నివాసితులు, ప్రవాసులను సోమవారం వార్న్ చేసింది. ఇటీవల కేటుగాళ్లు ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి పంపిస్తున్న సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొందరు మోసగాళ్లు (Scammers) ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలంటూ సందేశాలు పంపిస్తూ వాహనదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని తెలిపింది. సందేశాల్లో పంపిన లింక్ ద్వారా చలాన్లు చెల్లించి భారీ జరిమానాల నుంచి తప్పించుకోండంటూ వాహనదారులను బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మినిస్ట్రీ ప్రస్తావించింది. ఈ విషయమై సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రిత్వశాఖ కీలక విషయాలను వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో ప్రజలను బెదిరింపులకు పాల్పడే సందేశాలను మినిస్ట్రీ పంపించదని, ఒకవేళ ఎవరికైన ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని పట్టించుకోవద్దని సూచించింది.

ట్రాఫిక్ ఫైన్స్ (Traffic Fines) చెల్లించకుంటే భారీ జరిమానాలు ఉంటాయని మంత్రిత్వశాఖ సందేశాలు పంపించదని స్పష్టం చేసింది. తాము కేవలం అలర్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపిస్తామని పేర్కొంది. అది కూడా ఉల్లంఘనదారులకు 'సహేల్' డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే ఇలాంటి సందేశాలు పంపించడం జరుగుతుందని తెలియజేసింది. కాగా, కొందరు మోసగాళ్లు మినిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) క్లోనింగ్ చేసి ఇలాంటి తప్పుడు సందేశాలు పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏదైనా చెల్లింపులు చేసే ముందు కచ్చితంగా అది మినిస్ట్రీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైటా? కాదా? అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు ప్రజలను కోరారు.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-12T08:04:30+05:30 IST