Indians: యూఎస్-కెనడా బార్డర్‌లో విషాదకర ఘటన.. సరిహద్దు దాటుతూ 8మంది మృత్యువాత.. మృతుల్లో భారతీయ కుటుంబం..!

ABN , First Publish Date - 2023-04-01T09:08:35+05:30 IST

యూఎస్-కెనడా బార్డర్‌లో (US-Canada Border ) విషాద ఘటన చోటు చేసుకుంది.

Indians: యూఎస్-కెనడా బార్డర్‌లో విషాదకర ఘటన.. సరిహద్దు దాటుతూ 8మంది మృత్యువాత.. మృతుల్లో భారతీయ కుటుంబం..!

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్-కెనడా బార్డర్‌లో (US-Canada Border ) విషాద ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటేందుంకు యత్నించిన ఎనిమిది మంది శరణార్థులు మృత్యువాత పడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. వారందరూ ఒకే కుటుంబ సభ్యులని తెలుస్తోంది. మరో ముగ్గురిని కెనడా పౌరులుగా గుర్తించారు. అలాగే మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండడం విషాదకరం. అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్ (New York State) పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో (St. Lawrence River) ఈ ఘటన జరిగింది. గురువారం నది తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా మృతదేహాలను గుర్తించి ఒక్కొక్కటిగా వెలికి తీసినట్లు అక్వేసాస్నే మోహవ్క్ పోలీస్ సర్వీస్ చీఫ్ (Akwesasne Mohawk Police Service Chief) షాన్ డులుడే వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (U.S. President Joe Biden), కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో (Canadian Prime Minister Justin Trudeau) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయాన్ని కలిచివేసే సంఘటన అని పేర్కొన్నారు. మృతుల్లో పసికందు కూడా ఉండడం విచారకరం అని అన్నారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కెనడా, అమెరికాలోకి శరణార్థులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వరకు వెలుగులోకి వచ్చాయని అక్వెసాస్నే అధికారులు తెలిపారు. శరణార్థుల్లో అత్యధికంగా భారత్, రొమేనియాకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. మోహవ్క్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్, ఒంటారియో, న్యూయార్క్ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే వీటి ద్వారా ఇరు దేశాలకు అక్రమంగా శరణార్థులు అధిక సంఖ్యలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బార్డర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్న మాట.

ఇది కూడా చదవండి: ఇండియాలో బాగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. ఇక అమెరికా వీసా చాలా ఈజీ!

Updated Date - 2023-04-01T09:21:30+05:30 IST