Indian: సింగపూర్‌లో భారత వ్యక్తికి 10నెలల జైలు.. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-16T12:12:16+05:30 IST

తోటి కార్మికుడిపై దాడికి పాల్పడిన ఘటనలో భారత వ్యక్తి (Indian Man) కి సింగపూర్ కోర్టు శుక్రవారం పది నెలల జైలు శిక్ష విధించింది. దాడిలో గాయపడిన బాధితుడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. పీకలదాక తాగి ఇద్దరు బాహాబాహీకి దిగారు.

Indian: సింగపూర్‌లో భారత వ్యక్తికి 10నెలల జైలు.. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే..

సింగపూర్ సిటీ: తోటి కార్మికుడిపై దాడికి పాల్పడిన ఘటనలో భారత వ్యక్తి (Indian Man) కి సింగపూర్ కోర్టు శుక్రవారం పది నెలల జైలు శిక్ష విధించింది. దాడిలో గాయపడిన బాధితుడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. పీకలదాక తాగి ఇద్దరు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో బాధితుడి చూపుడు వేలు కొరికేశాడు నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఘటన జరగగా, తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. దోషిగా తేలిన భారత వ్యక్తికి న్యాయస్థానం 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తంగరాసు రెంగసామీ (40), నాగూరన్ బాలసుబ్రహ్మణ్యం (50) ఇద్దరూ భారతీయ వ్యక్తులు బెడోక్‌ (Bedok) లోని పారిశ్రామిక ప్రాంతం కాకీ బుకిట్‌లోని ప్రత్యేక విదేశీ కార్మికుల వసతి గృహాలలో నివసిస్తున్నారు. తంగరాసు క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా, నాగూరన్ మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఏప్రిల్ 22న నాగూరన్ మరో భవన నిర్మాణ కార్మికుడు రామమూర్తి అనంతరాజ్‌తో కలిసి మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ కలిసి డ్రింక్ చేస్తున్న సమయంలో తంగరాసు కూడా అదే షాప్‌కు వచ్చాడు. వారికి కూసింత దూరంలోనే కూర్చొని పూటుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా గట్టిగా అరవడం చేస్తున్నాడు. దాంతో నాగూరన్ అలా ఎందుకు అరుస్తున్నావంటూ మందలించాడు. అంతే.. నాగూరన్‌పై తంగరాసు విరుచుకుపడ్డాడు. నోటికి వచ్చిన బూతులు తిట్టాడు. దాంతో మనోడు అతడిపై చేయి చేసుకున్నాడు. ఇంకేముంది ఇద్దరూ బాహాబాహీకి దిగారు. కిందపడి మరి కొట్టుకున్నారు.

ఈ క్రమంలో నాగూరన్ చూపుడు వేలును తంగరాసు గట్టిగా కొరికేశాడు. దాంతో అతడి వేలు తెగిపోయింది. తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న అతణ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తంగరాసును అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. తింగరాసు తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!


Updated Date - 2023-09-16T12:12:16+05:30 IST