Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

ABN , First Publish Date - 2023-05-05T17:47:40+05:30 IST

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు.

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ‘పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు లక్షలాది మంది భారతీయులు నిత్యం వస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకు గల్ఫ్ దేశాల్లోనే చెమటోడ్చి మరీ పనిచేస్తున్నారు. కుటుంబం కోసం ఎన్నో బాధలను పంటిబిగువున భరిస్తున్నారు. అలాంటి ప్రవాసులు జీవిత చరమాంకంలో వృద్ధాప్యంలో సొంతూళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెన్షన్లు కూడా వారికి అందడం లేదు..’ అంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌కు బహ్రెయిన్ లోని తెలంగాణ సామాజిక ప్రముఖుడు వెంకట స్వామి ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో స్వదేశానికి తిరిగొచ్చిన ప్రవాసులకు పెన్షన్ అందేట్లు చూడాలని కేంద్రమంత్రికి ఆయన విన్నవించారు.

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాకు చెందిన వెంకట స్వామి కేంద్రమంత్రిని కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. ప్రవాసీయులు తమ జీవితంలో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల్లో గడిపి.. స్వదేశానికి విదేశీ మారకం పంపడం ద్వారా జాతికు మేలు చేస్తున్నారని ఆయనకు గుర్తు చేశారు. దేశానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తున్న ప్రవాసులు.. జీవిత చరమాంకంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రవాసులకు పునరావసం కల్పించేందుకు కృషి చేయాలనీ.. అలాగే నెలనెలా ప్రవాసులకు ప్రత్యేక పెన్షన్ సౌకర్యం ఉండేలా చూడాలని కేంద్రమంత్రిని వెంకట స్వామి కోరారు. ప్రవాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఈ సందర్భంగా కేంద్రమంత్రి మురళీధరన్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-05T17:47:40+05:30 IST