Viral Video: అమెరికాలో ఘోరం.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే భారతీయ నటుడిపై దాడి.. శరీరంపై పలుచోట్ల కత్తి పోట్లు..!
ABN , First Publish Date - 2023-03-17T11:05:24+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో (America) ఘోరం జరిగింది. భారతీయ నటుడు అమన్ ధలీవాల్‌పై (Indian actor Aman Dhaliwal) యూఎస్‌లో కత్తితో దాడి జరిగింది.

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో (America) ఘోరం జరిగింది. భారతీయ నటుడు అమన్ ధలీవాల్‌పై (Indian actor Aman Dhaliwal) కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు పదునైన ఆయుధంతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ధలీవాల్ గురువారం జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని (California) ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో (Planet Fitness Gym) జరిగిన ఈ దాడిలో ఆయన శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. జిమ్ చేస్తున్న ఆయనపై అందరూ చూస్తుండగానే సదరు వ్యక్తి దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటన తాలూకు వీడియో, ఫొటోలు బయటకు రావడంతో వైరల్ అవుతున్నాయి. దుండగుడు దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా ధలీవాల్ అతడిని చాకచక్యంగా పట్టుకుని కిందపడేశాడు. అనంతరం జిమ్ సిబ్బంది వచ్చి దుండగుడిని పట్టుకుని బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధలీవాల్‌ను జిమ్ సిబ్బంది (Gym Staff) చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ధలీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం తాను మాట్లాడే పరిస్థితిలో లేనని, కోలుకున్న ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెబుతానని నటుడు వెల్లడించాడు. పంజాబీ నటుడైన ధలీవాల్ ఇప్పటికే బాలీవుడ్‌లో 'బిగ్ బ్రదర్', 'జోదా అక్బర్' చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా'లో కీలక పాత్ర పోషించారు. అటు పలు పంజాబీ మూవీస్‌లో (Punjabi Movies) కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఘటన అతడి అభిమానులతో పాటు యూఎస్‌లోని భారతీయ సమాజాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాలిఫోర్నియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: యూఏఈ మరో కీలక నిర్ణయం.. 2023 మూడో త్రైమాసికం నుంచి ప్రత్యేక వర్క్ పర్మిట్లు