Share News

Qatar: తెలుగు వ్యక్తి సహా 8 మంది భారతీయులకు ఉరిశిక్ష.. మాజీ నేవీ అధికారులైన వీరు చేసిన నేరమేంటంటే..?

ABN , First Publish Date - 2023-10-27T06:55:04+05:30 IST

భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు గూఢచర్యం ఆరోపణలపై ఖతర్‌లో ఓ స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కమాండర్‌ పాకాల సుగుణాకర్‌ కాగా మిగిలిన వారు కెప్టెన్‌ నవ్‌తేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ సౌరభ్‌ వశిష్ట్‌, కమాండర్‌ పూర్ణేందు తివారీ, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, రాగేశ్‌.

Qatar: తెలుగు వ్యక్తి సహా 8 మంది భారతీయులకు ఉరిశిక్ష.. మాజీ నేవీ అధికారులైన వీరు చేసిన నేరమేంటంటే..?

ఖతర్‌ కోర్టు తీర్పు.. వీరందరూ నౌకాదళ మాజీ అధికారులు

ఒకరు విశాఖకు చెందిన మాజీ కమాండర్‌..

దోహాలో ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండగా నిరుడు అరెస్టు

ఇజ్రాయెల్‌కు గూఢచర్యం ఆరోపణలు..

మరణశిక్షపై భారత విదేశాంగశాఖ దిగ్ర్భాంతి

న్యాయపరమైన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని వెల్లడి..

భారత్‌-ఖతర్‌ సంబంధాలపై ప్రభావం?

న్యూఢిల్లీ, అక్టోబరు 26: భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు గూఢచర్యం ఆరోపణలపై ఖతర్‌లో ఓ స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కమాండర్‌ పాకాల సుగుణాకర్‌ కాగా మిగిలిన వారు కెప్టెన్‌ నవ్‌తేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ సౌరభ్‌ వశిష్ట్‌, కమాండర్‌ పూర్ణేందు తివారీ, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, రాగేశ్‌. ఖతర్‌కు చెందిన అల్‌ దహ్రా కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిని గత ఏడాది ఆగస్టులో రాజధాని దోహాలో అరెస్టు చేశారు. అయితే, వారిపై ఉన్న అభియోగాలను ఇప్పటివరకూ బహిరంగపరచలేదు. పలుమార్లు విచారణ అనంతరం స్థానికకోర్టు మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. దీనిపై భారత విదేశాంగశాఖ దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, తమ ముందు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంది. ‘అల్‌ దహ్రా కంపెనీకి చెందిన ఎనిమిది మంది భారతీయ ఉద్యోగులకు మరణశిక్ష విధించారని తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాం. పూర్తి తీర్పు కోసం వేచి చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులతో, న్యాయబృందంతో సంప్రదింపుల్లో ఉన్నాం. ఖతర్‌ అధికారులతోనూ దీనిపై మాట్లాడతాం’ అని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8 మంది మాజీ అధికారులు నౌకాదళంలో 20 ఏళ్లపాటు మచ్చలేని సేవలందించి, ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారని, అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కేసు పూర్వాపరాలు

ఖతర్‌లో మరణశిక్షకు గురైన 8మందిలో అత్యధి కులు 60 ఏళ్లకు పైబడినవారే. కొందరు భారత నౌకాదళానికి చెందిన ముఖ్యమైన యుద్ధనౌకలకు సారథ్యం వహించారు కూడా. వీరందరూ ఖతర్‌లోని అల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అనే ప్రైవేటు కంపెనీలో కొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ఖతర్‌ నౌకాదళానికి శిక్షణ, సహకారం అందిస్తోంది. ఒమన్‌ వాయుసేన మాజీ స్క్వాడ్రన్‌ లీడర్‌ ఖామిస్‌ అల్‌ అజ్మీ ఈ కంపెనీకి సీఈవో. ఇటలీ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములను నిర్మించే ఒక రహస్య ప్రాజెక్టు కోసం ఈ కంపెనీ.. 8మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులను ఉద్యోగులుగా నియమించుకుంది. అయితే, ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో భారతీయ అధికారులు 8 మందిని గత ఏడాది ఆగస్టు 30న ఖతర్‌ నిఘా విభా గం అరెస్టు చేసింది. ఈ మేరకు వారి వద్ద కొన్ని ఎలక్ర్టానిక్‌ సాక్ష్యాధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు ఖామిస్‌ అజ్మీని కూడా అరెస్టు చేసినప్పటికీ గత ఏడాది నవంబరులోనే ఆయనను విడుదల చేశారు. భారతీయులపైన మాత్రం ఈ ఏడాది మార్చి 29 నుంచి న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. బెయిల్‌ కోసం వారు ఎనిమిదిసార్లు పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. గురువారం ‘ఖతర్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టెన్స్‌’ (ప్రాథమిక న్యాయస్థానం) వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

కంపెనీ మూతబడింది

అల్‌ దహ్రా కంపెనీ దోహాలో తన కార్యకలాపాలను గత ఏడాది మే నెలాఖరుతో నిలిపివేసింది. కంపెనీ తాలూకు పాత వెబ్‌సైట్‌లో తాము ఖతర్‌ నౌకాదళానికి శిక్షణ, నిర్వహణ, రవాణాపరంగా సహకారం అందిస్తున్నామని ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌ ఉనికిలో లేదు. కొత్త వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రస్తావనే లేదు. అరెస్టయిన భారతీయ అధికారుల వివరాలు కూడా లేవు. కంపెనీ తన పేరును కూడా దహ్రా గ్లోబల్‌గా మార్చుకోవటం గమనార్హం. విశేషమేమిటంటే, ఈ కంపెనీకి గతంలో ఎండీగా పని చేసి, ప్రస్తుతం జైలులో ఉన్న కమాండర్‌ పూర్ణేందు తివారీకి 2019లో ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం లభించింది. భారత్‌, ఖతర్‌ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు కేంద్రప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.

ఎందుకు అరెస్టు చేశారు?

గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేసే నాటికి దహ్రా కంపెనీలో భారతీయులు కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఖతర్‌ నిఘావిభాగం వారిని అరెస్టు చేసింది. ఈ విషయం భారత రాయబార కార్యాలయానికి ఒక నెల రోజుల తర్వాత (సెప్టెంబరు మధ్య నాటికి)గానీ తెలియరాలేదు. సెప్టెంబరు 30న తమ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు టెలిఫోన్‌లో మాట్లాడుకోవటానికి వారికి అవకాశం ఇచ్చారు. అక్టోబరు 3న దౌత్యసాయానికి అనుమతించటంతో భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు వారిని కలిశారు. ఆ తర్వాత నుంచీ వారానికొకసారి కుటుంబసభ్యులు ఫోన్‌లో మాట్లాడటానికి, దోహాలో ఉంటే వారు జైలుకు వచ్చి కలుసుకోవటానికి అనుమతించారు. భారతీయుల మీద ఉన్న ఆరోపణలు ఏమిటన్నది ఇప్పటి వరకూ ఖతర్‌ అధికారులు బహిరంగపరచలేదు. అయితే, భద్రతకు సంబంధించిన అంశాలపైనే ఈ అరెస్టులు జరిగి ఉంటాయన్న ఊహాగానాలు మాత్రం వెలువడ్డాయి.

1sug.jpg

ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు

దశాబ్దాలుగా భారత్‌-ఖతర్‌ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 2008లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఖతర్‌లో పర్యటించారు. భారత ప్రధానమంత్రి ఆ దేశ పర్యటనకు వెళ్లటం అదే తొలిసారి. ఆ తర్వాత నుంచి ఇరుదేశాలు మరింత సన్నిహితమయ్యాయి. ఖతర్‌ అధినేత (ఎమిర్‌) షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ 2015లో భారత్‌లో పర్యటించారు. మరుసటి ఏడాది ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందింది. 2021లో ఖతర్‌ ఎగుమతులకు సంబంధించి భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా, దిగుమతుల విషయంలో మన దేశం మూడోస్థానంలో ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం 1500 కోట్ల డాలర్లుగా నమోదైంది. దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఖతర్‌ నుంచి భారత్‌కు సహజ వాయువు దిగుమతులే. ఇదొక్కటే 1300 కోట్ల డాలర్లు ఉంటుంది. భారత్‌-ఖతర్‌ సంబంధాల్లో రక్షణ భాగస్వామ్యం పునాది వంటిది. 2008లో మొదలైన ఈ భాగస్వామ్యం ఎప్పటికప్పుడూ విస్తరిస్తూ ఉంది.

నుపుర్‌ వ్యాఖ్యలతో సంబంధాల్లో క్షీణత!

ఇరు దేశాల మధ్య సంబంధాలకు తొలిసారిగా గత ఏడాది జూన్‌లో సవాల్‌ ఎదురైంది. మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. ఈ వివాదంపై తొట్టతొలిగా స్పందించిన దేశం ఖతర్‌. నుపుర్‌ వ్యాఖ్యలపై భారత్‌ అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఖతర్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. తమ దేశంలోని భారత రాయబారిని పిలిపించి ఈ మేరకు నిరసన కూడా తెలిపింది. ఈ వివాదం యావత్‌ ఇస్లాం ప్రపంచానికి వ్యాపించింది. పలు ఇస్లాం దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయు. దీంతో పార్టీ పదవి నుంచి నుపుర్‌ శర్మను బీజేపీ తప్పించింది. ఫలితంగా వివాదం సద్దుమణిగినప్పటికీ భారత్‌-ఖతర్‌ సంబంధాలపై ఈ ఘటన ప్రభావం చూపింది. ప్రస్తుతం 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అరెస్టు చేసి వారికి ఏకంగా మరణశిక్ష విధించటంతో ఇరుదేశాల స్నేహంపై కారునీడలు కమ్ముకున్నాయి. ఒకరకంగా ఇది భారత్‌కు పెద్ద సవాలే. ఖతర్‌లో 8 లక్షల మంది భారతీయులు వివిధ ఉద్యోగాల్లో ఉన్నారు. వారి వల్ల భారత్‌కు వందల కోట్లల్లో విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. ఇరుదేశాల సంబంధాల ప్రభావం వీరి భవిష్యత్తుపై కూడా తీవ్రంగా పడనుంది. -సెంట్రల్‌ డెస్క్‌

భారత్‌ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : ఎనిమిది మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్షపై ఖతర్‌ ప్రభుత్వంగానీ మీడియాగానీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. సాధారణంగా ఈ రకమైన సున్నితమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని గల్ఫ్‌ దేశాలు వెల్లడించవు. గతంలో ఈ కేసు గురించి ఢిల్లీలోని భారతీయ అధికారులను ఉటంకిస్తూ వార్త రాసిన ఖతర్‌లోని ఒక భారతీయ విలేకరిని కుటుంబంతో సహా దేశం నుండి బహిష్కరించింది అక్కడి ప్రభుత్వం. 24 గంటలలోపు దేశం వదిలి వెళ్లాలని గడువు ఇచ్చారు. ప్రస్తుత కేసులో కూడా ఎనిమిది మంది భారతీయులను గతేడాది ఆగస్టులో అరెస్టు చేసిన విషయం కొన్ని వారాల తర్వాత బయటపడింది. అరెస్టయిన వారిలో ఒకరి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం వెల్లడైంది. భారత ఎంబసీ తీవ్రమైన ప్రయత్నాలు చేసిన తర్వాత.. భారతీయ అధికారులు కలవటానికి సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఖతర్‌ ప్రభుత్వం అనుమతించింది. ఈ కేసుపై న్యాయస్థానం ఇప్పటివరకూ ఏడుసార్లు విచారణ జరిపింది. 8 మందిని రక్షించటానికి.. గల్ఫ్‌ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్న అధికారి విపుల్‌ను ఖతర్‌లో భారతీయ రాయబారిగా కేంద్రం నియమించి పలు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ, ఇంతలోనే పిడుగుపాటులా మరణశిక్ష తీర్పు వెలువడింది.

విశాఖ నుంచి ఖతర్‌కు..

విశాఖపట్నం: గూఢచర్యం కేసులో ఖతర్‌ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది భారతీయ నేవీ మాజీ అధికారుల్లో ఒకరైన పాకాల సుగుణాకర్‌ విశాఖపట్నానికి చెందినవారు. విశాఖపట్నం టింపనీ స్కూల్‌లో, ఆ తర్వాత విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆయన చదువుకున్నారు. అనంతరం నేవల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యనభ్యసించి నేవీలో చేరారు. కమాండర్‌ స్థాయికి ఎదిగారు. విధుల్లో భాగంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత పదవీ విరమణ చేసి దహ్రా కంపెనీలో చేరారు. అక్కడ నేవీ సంబంధిత శిక్షణ ఇచ్చేవారు. సుగుణాకర్‌ భార్య పేరు వైజయంతి. ఆమె విశాఖపట్నంలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల వైజయంతి దోహాకు వెళ్లి... జైలులో ఉన్న తన భర్తను కలిసినట్లు సమాచారం.

Updated Date - 2023-10-27T07:10:35+05:30 IST