Expats quit: అసలు కువైత్‌లో ఏం జరుగుతుంది.. ఒక్క ఏడాదిలోనే 1.79లక్షల మంది ప్రవాసులను వెళ్లగొట్టిన గల్ఫ్ దేశం..!

ABN , First Publish Date - 2023-03-03T08:15:33+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది.

Expats quit: అసలు కువైత్‌లో ఏం జరుగుతుంది.. ఒక్క ఏడాదిలోనే 1.79లక్షల మంది ప్రవాసులను వెళ్లగొట్టిన గల్ఫ్ దేశం..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఐదేళ్ల క్రితం వలసదారుల ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy), 60ఏళ్లు దాటి, యూనివర్శిటీ డిగ్రీలు లేని వారికి అధిక ఫీజులు వసూలు చేస్తుండడం ఇలా పలు కారణాలతో గతేడాది కువైత్‌ను విడిచిపెట్టిన ప్రవాసుల (Expats) సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క 2022లోనే ఏకంగా 1,78,919 మంది ప్రవాసులు ఆ దేశాన్ని వదిలిపెట్టినట్లు తాజాగా విడుదలైన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (Public Authority for Civil Information) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 60ఏళ్లు పైబడి, వర్శిటీ డిగ్రీలేని వారికి ఫీజును భారీగా పెంచడంతో (ప్రస్తుతం 800కువైటీ దినార్లుగా ఉంది) గతేడాది ఆ దేశాన్ని వదిలిపెట్టిన వలసదారుల సంఖ్య 17,891గా ఉందని గణాంకాలు తెలిపాయి. దీంతో 2021 మొదటి అర్ధభాగంలో 1,22,536గా ఉన్న ఈ కేటగిరీ ప్రవాసుల సంఖ్య 2022 తొలి ఆరు నెలలు గడిచేసరికి 1,04,645కు పడిపోయింది.

అటు పబ్లిక్ సెక్టార్‌లో పని చేస్తున్న ప్రవాసుల సంఖ్య కూడా భారీగానే తగ్గిపోయింది. తాజా పీఏసీఐ (PACI) లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4,83,200గా ఉంటే.. ఇందులో 3,72,800 మంది కువైటీలే (Kuwaitis) ఉన్నారు. ఇది సుమారు 77 శాతానికి సమానం. ఇక ప్రవాస ఉద్యోగులు కేవలం 1,10,400 మాత్రమే. ఇక పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో కలిపి మొత్తం 1.91 మిలియన్ల మంది వర్క్ ఫోర్స్ (Work Force) కువైత్‌లో ఉంది. ఇందులో ప్రైవేట్ సెక్టార్‌లోనే 75 శాతం మంది ఉన్నారు. ఇక ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల విషయానికి వస్తే.. సౌదీ అరేబియా ప్రభుత్వ సెక్టార్‌లో 1.7 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 90.8 మంది సౌదీలు, 9.1 మంది వలసదారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: రెసిడెన్సీ వీసాపై బంధువుల స్పాన్సర్షిప్‌కు కొత్త రూల్.. ఇకపై..

అటు బహ్రెయిన్ పబ్లిక్ రంగంలో (Public Sector) 39,800 మంది కార్మికులుంటే 85.4 శాతం మంది స్థానికులు, మిగిలిన 14.6 మంది ప్రవాసులు ఉన్నారు. ఇక యూఏఈలో (UAE) ప్రభుత్వ సెక్టార్‌లో 1మిలియన్ మంది పనిచేస్తుంటే.. వారిలో 89శాతం మంది దేశ పౌరులు, 11 మంది వలసదారులు పనిచేస్తున్నారు. అటు ఒమాన్‌లో (Oman) మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,93,000గా ఉంది. ఇందులో 89శాతం మంది ఒమనీలు, మిగిలిన 11 మంది ప్రవాసులు. ఈ లెక్కన చూస్తే మిగతా జీసీసీ దేశాల కంటే కూడా ఇప్పటికీ కువైత్‌ ప్రభుత్వ సెక్టార్‌లోనే (23శాతం) అత్యధిక మంది వలస ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, గడిచి ఏడాది కాలంగా మాత్రం ఆ దేశాన్ని విడిచిపెడుతున్న వలసదారుల సంఖ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా పెరిగిందనేది కాదనలేని వాస్తవం.

ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

Updated Date - 2023-03-03T08:37:21+05:30 IST