AAP Vs YCP : కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చిన సీఎం జగన్

ABN , First Publish Date - 2023-07-27T11:13:22+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారు.

AAP Vs YCP : కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చిన సీఎం జగన్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారు. దీంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూరింది.

దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ సవరణ బిల్లు, 2023కు మద్దతు కూడగట్టడం కోసం కేజ్రీవాల్ అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా పార్టీలు, ముఖ్యమంత్రులతో సమావేశమై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది. దీంతో ఆయన పార్టీ ప్రతిపక్ష కూటమి ఇండియాలో కొనసాగుతోంది.


ఈ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అన్ని పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను అణచివేసే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని తన పార్టీ ఎంపీలకు ఇటీవల స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సమాఖ్య విధానానికి అన్ని రాష్ట్రాలు మద్దతివ్వాలని ఆప్ కోరిన విషయాన్ని ప్రస్తావించినపుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ, ఢిల్లీ సంపూర్ణ రాష్ట్రం అయి ఉంటే, తాము ఆప్‌ను సమర్థించి ఉండేవారమని చెప్పారు. ఢిల్లీ సంపూర్ణ రాష్ట్రం కాదన్నారు.

కొందరు వైసీపీ ఎంపీలు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాము కాంగ్రెస్‌వైపు ఉండలేమని చెప్పారు. సమాఖ్య నిర్మాణాన్ని గతంలో కాంగ్రెస్ చాలాసార్లు ఉల్లంఘించలేదా? అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 237 మంది ఎంపీలు రాజ్యసభలో ఓటు వేయడానికి అర్హులు కాగా, ఎన్డీయేకు 123 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించేవారు 108 మంది ఉన్నారు. బీజేడీకిగల తొమ్మిది మంది ఎంపీలు కూడా ఈ బిల్లుకు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తన ఏడుగురు ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో అందరు బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో హాజరై, ఢిల్లీ సర్వీసుల బిల్లును వ్యతిరేకించాలని ఆ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.

ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి మే 19న జారీ చేశారు. దీనికి బదులుగా రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.


ఇవి కూడా చదవండి :

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

Updated Date - 2023-07-27T11:13:22+05:30 IST