Mamata Banerjee: మమత నోట..కాంగ్రెస్‌కు మద్దతు మాట..!

ABN , First Publish Date - 2023-05-15T19:59:17+05:30 IST

కోల్‌కతా: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఐక్య విపక్ష కూటమి' ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

Mamata Banerjee: మమత నోట..కాంగ్రెస్‌కు మద్దతు మాట..!

కోల్‌కతా: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఐక్య విపక్ష కూటమి' ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్యతకు సంబంధించి టీఎంసీ వ్యూహాన్ని మమతా బెనర్జీ స్పష్టం చేయడం ఇదే మొదటిసారి.

''కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఆ పార్టీ పోరాడుతుంది. వారికి మేము సపోర్ట్‌గా నిలుస్తాం. అందులో తప్పేమీ లేదు. అయితే వారు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సపోర్ట్‌గా నిలవాలి'' అని సోమవారంనాడు సెక్రటేరియట్‌లో జరిగిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ అన్నారు. సీట్ల కేటాయింపు ఫార్ములా విషయంలోనూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

కర్ణాటక ప్రజలకు సెల్యూట్...

కాగా, ఈ నెల 13వ తేదీన వెలువడిన కర్ణాటక ఫలితాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన వెంటనే మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు సెల్యూట్ చేశారు. కాంగ్రెస్ పేరు మాత్రం ఆమె ప్రస్తావించ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మమతా బెనర్జీ ఆ తర్వాత పార్టీని వీడి టీఎంసీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్య కూటమి ఏర్పాటు అవసరాన్ని మమతా బెనర్జీ గట్టిగా చెబుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల ఆ ప్రయత్నాలను వేగవంతం చేశారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక పార్టీల (విపక్షాల) నేతలను కలుసుకుంటున్నారు. జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్‌‌ను కలుపుకోకుండా విపక్ష ఐక్యత సాధ్యం కాదనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి టీఎంసీ మద్దతు ఉంటుందని మమత ప్రకటించడం విపక్ష ఐక్యతా యత్నాల్లో మరో ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-05-15T20:37:04+05:30 IST