West Bengal panchayat election : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నలుగురు టీఎంసీ కార్యకర్తల హత్య..

ABN , First Publish Date - 2023-07-08T10:42:26+05:30 IST

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హింసాకాండ తీవ్రంగా ఉంది. శుక్రవారం నలుగురు టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పోలింగ్‌ ప్రారంభమవడానికి ముందు తమపై దాడులు జరిగాయని కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి.

West Bengal panchayat election : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నలుగురు టీఎంసీ కార్యకర్తల హత్య..
TMC MP Mohua Moitra

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హింసాకాండ తీవ్రంగా ఉంది. శుక్రవారం నలుగురు టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పోలింగ్‌ ప్రారంభమవడానికి ముందు తమపై దాడులు జరిగాయని కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి.

శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగిన జిల్లాల్లో ముర్షీదాబాద్ ఒకటి. ఈ జిల్లాలోని కపస్డంగ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ హత్యకు గురయ్యారు. ఆయనను బహరంపూర్ ఆసుపత్రికి తరలించారు, కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ జిల్లాలోని రెజినగర్ గ్రామంలో శుక్రవారం క్రూడ్ బాంబు పేలుడులో మరో టీఎంసీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలోని ఖర్గమ్ ప్రాంతంలో మరో టీఎంసీ కార్యకర్తపై దాడి జరిగింది. ఆయనను కత్తితో దారుణంగా పొడిచి, చంపేశారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని సోనాచుర గ్రామంలో టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ దేవకుమార్ రాయ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. జల్పాయిగురిలో టీఎంసీ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లడంతో టీఎంసీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర బలగాల కోసం గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు ఇప్పుడేమంటాయని ప్రశ్నించింది. దిగ్భ్రాంతికరమైన, విషాదకర సంఘటనలు ఓట్లు వేసే ప్రజలకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని ఆరోపించింది. రెజినగర్, తుఫాన్ గంజ్, ఖర్‌గ్రామ్ గ్రామాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలను హత్య చేశారని తెలిపింది. డొమ్కోల్‌లో ఇద్దరిపై కాల్పులు జరిగాయని పేర్కొంది. కూచ్‌బేహార్‌లోని రాంపూర్‌లో టీఎంసీ బూత్ కమిటీ చైర్మన్‌ గణేశ్ సర్కార్‌ను కత్తితో పొడిచి; హత్య చేశారు. ఒక్రాబరి గ్రామంలో సీపీఎం కార్యకర్త హఫీజుర్ రహమాన్‌పై కాల్పులు జరిగాయి, ఆయన గాయపడ్డారు. నాడియా జిల్లాలోని గజ్న గ్రామ పంచాయితీలో టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నారాయణ్‌పూర్-1 గ్రామ పంచాయతీలో తమ పార్టీ అభ్యర్థిని హసీనా సుల్తానా భర్తపై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది.

నిలిచిన పోలింగ్

రాయ్‌గంజ్‌లో బీజేపీ కార్యకర్తల డిమాండ్‌తో పోలింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఓ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె ట్వీట్ చేశారు. టీఎంసీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అక్రమాల వీడియో మోదీకి షేర్

బ్యాలట్లను టీఎంసీ బహిరంగంగానే లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. ఖోలాఖలి, నూర్పుర్ పంచాయతీలోని 44, 45 బూత్‌లలో జరుగుతున్న అక్రమాలను చూపించే వీడియోను ఆయన ట్వీట్ చేశారు. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలకు ట్యాగ్ చేశారు. టీఎంసీ గూండాయిజానికి పాల్పడుతోందని, బహిరంగంగా బ్యాలట్లను లూటీ చేస్తూ ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని, అన్ని హద్దులను చెరిపేసిందని ఆరోపించారు.

కేంద్ర బలగాల సమర్థత ప్రశ్నార్థకం : టీఎంసీ

ఇదిలావుండగా, కేంద్ర బలగాల సమర్థతను టీఎంసీ ప్రశ్నించింది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆరోపించింది. మాల్డాలోని మణిక్చక్‌లో బాంబు దాడిలో తమ పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నారాయణ్‌పూర్-1 గ్రామ పంచాయతీలో తమ పార్టీ అభ్యర్థిని హసీనా సుల్తానా భర్తపై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించింది. కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ, సల్బరి-2 గ్రామ పంచాయతీలో తమ పార్టీ కార్యకర్తపై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపించింది. తాజా సంఘటనల వల్ల కేంద్ర బలగాల సమర్థత, సన్నద్ధతలపై సందేహాలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపింది. ఎన్నికలు శాంతియుతంగా జరగడం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీల మాటల్లో డొల్లతనం స్పష్టంగా బయటపడిందని తెలిపింది.

రెండు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు లేవు

పశ్చిమ బెంగాల్‌లో మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది. 73,887 సీట్ల కోసం 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 22 జిల్లాల్లో గ్రామ పంచాయతీ స్థానాలు 63,229 కాగా, పంచాయతీ సమితి స్థానాలు 9,730. డార్జిలింగ్ కలింపోంగ్ జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగడం లేదు. ఈ జిల్లాల్లో గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్, సిలిగురి సబ్ డివిజినల్ కౌన్సిల్ ఉన్నాయి. 20 జిల్లాల్లో 928 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 8న ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రత కోసం 600 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. వీరితోపాటు దాదాపు 70 వేల మంది రాష్ట్ర పోలీసులు కూడా భద్రత చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Tomato: తగ్గిన టమోటా ధరలు

Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ

Updated Date - 2023-07-08T10:42:26+05:30 IST