Amritpal Singh : శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : సీఎం భగవంత్‌ మాన్

ABN , First Publish Date - 2023-04-23T20:33:31+05:30 IST

శాంతికి విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు,

Amritpal Singh : శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : సీఎం భగవంత్‌ మాన్
Bhagwant Mann, Punjab CM

చండీగఢ్ : శాంతికి విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ (Amritpal Singh) కోసం దాదాపు ఓ నెల నుంచి గాలిస్తున్న సమయంలో శాంతియుతంగా మెలగిన పంజాబ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

అమృత్‌‌పాల్ సింగ్ ఆదివారం ఉదయం మోగాలోని రోడే గ్రామంలో పోలీసులకు లొంగిపోయారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి, అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఓ గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అమృత్‌పాల్ లొంగిపోయారు. మార్చి 18 నుంచి ఆయన కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.

అమృత్‌పాల్ అరెస్టుపై ఆయన తల్లి బల్విందర్ కౌర్ స్పందిస్తూ, తన కొడుకు సింహమని, సింహంలాగే లొంగిపోయాడని, తన కొడుకును చూసి గర్విస్తున్నానని అన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని, త్వరలోనే తన కొడుకును కలుస్తానని చెప్పారు. అమృత్‌పాల్ సింగ్ తండ్రి తరసేమ్ సింగ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తన కుమారుడు పోరాటం చేశాడన్నారు. ఆయన చేపట్టిన మిషన్ ముందుకు సాగాలన్నారు. కాగా, అమృత్‌పాల్ అరెస్టుపై ఆయన కుటుంబం న్యాయపోరాటం చేస్తుందని ఆయన మేనమామ సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు. అమృత్‌పాల్ ఆదివారం ఉదయం లొంగిపోయినట్టు తనకు తెలిసిందని, ఆయన పోలీసు కస్టడీలో ఉన్నాడని అనుకుంటున్నామని, ఆయన ఎప్పుడూ తమతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను 35 రోజుల తర్వాత ఆదివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించేవారు, దేశ చట్టాలను ఉల్లంఘించేవారు చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. ఆయనను మార్చి 18న అరెస్టు చేసి ఉంటే, తూటాలు పేలి ఉండేవన్నారు తన ప్రభుత్వం దానిని కోరుకోలేదన్నారు. తన ప్రభుత్వం అమాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని చెప్పారు. శనివారం రాత్రంతా తాను సీనియర్ అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని, తనకు రాత్రంతా నిద్ర లేదని చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దుకాణాలను నడుపుకునేవారు తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించడాన్ని సహించేది లేదన్నారు. పంజాబ్ భూమి సారవంతమైనదని, ఇక్కడ ఏదైనా పండుతుందని చెప్పారు. అయితే విద్వేషపు బీజాలు ఎన్నటికీ వృద్ధి చెందవని తెలిపారు. అవి పెరగడానికి అవకాశం ఇచ్చేది లేదన్నారు. పంజాబ్ యువత డిగ్రీలు సంపాదించి, ఉన్నత పదవులను పొందాలని, క్రీడల్లో పతకాలు సాధించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Satyapal Malik VS Amit shah: సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన అమిత్‌షా

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

Updated Date - 2023-04-23T20:33:31+05:30 IST