Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్

ABN , First Publish Date - 2023-05-25T15:34:15+05:30 IST

తమిళనాడు పాల సహకార సంఘం ఆవిన్‌‌కుగల మిల్క్ షెడ్ ఏరియా నుంచి పాలను గుజరాత్‌కు చెందిన పాల సహకార సంఘం అమూల్ సేకరించకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.

Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్
Amit Shah , MK Stallin

చెన్నై : తమిళనాడు పాల సహకార సంఘం ఆవిన్‌‌కుగల మిల్క్ షెడ్ ఏరియా నుంచి పాలను గుజరాత్‌కు చెందిన పాల సహకార సంఘం అమూల్ సేకరించకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆవిన్ పరిధిలోని పాలను అమూల్ సేకరిస్తే అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమిత్ షా (Amit Shah)కు స్టాలిన్ (MK Stallin) గురువారం రాసిన లేఖలో, గుజరాత్‌కు చెందిన అమూల్ (Amul) ఇప్పటి వరకు తమిళనాడు (Tamil Nadu)లోని ఔట్‌లెట్లలో తన ఉత్పత్తులను అమ్ముతోందని తెలిపారు. అయితే అమూల్‌కుగల బహుళ రాష్ట్రాల లైసెన్స్‌ను ఉపయోగించుకుని, కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లను, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఇకపై తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూరు, రాణీపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో, వారి పరిసర ప్రాంతాల్లో పాలను సేకరించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక సహకార సంస్థకు గల మిల్క్ షెడ్ ఏరియాలోకి మరొకటి చొరబడకుండా వృద్ధి చెందాలనే సంప్రదాయం ఉందన్నారు. క్రాస్ ప్రొక్యూర్‌మెంట్ జరగడం ఆపరేషన్ వైట్ ఫ్లడ్ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. 1970లో ప్రారంభమైన ఆపరేషన్ వైట్ ఫ్లడ్ ప్రాజెక్టు వల్ల మన దేశం అత్యధిక పాల ఉత్పత్తిదారుగా మారిందని చెప్పారు. దేశంలో పాల కొరత ఉందని, అటువంటి పరిస్థితుల్లో అమూల్ ఈ విధంగా ఆవిన్ పరిధిలోని పాలను సేకరిస్తే, సమస్యలు మరింత ముదురుతాయని చెప్పారు. అమూల్ చర్యలు ఆవిన్ మిల్క్ షెడ్ ఏరియాలో చొరబడే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల్లో ప్రాంతీయ సహకార సంస్థలు పాడి పరిశ్రమాభివృద్ధికి పునాదివంటివని తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు వీటివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ ఆవిన్ కోఆపరేటివ్ క్రింద గ్రామీణ పాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల కోసం 9,673 పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీలు పని చేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలావుండగా, కర్ణాటకలోని నందిని సహకార సంస్థను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అమూల్ సంస్థ కర్ణాటకలో ప్రవేశించబోతోందని, నందిని సంస్థను దెబ్బతీయబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. శాసన సభ ఎన్నికల సమయంలో ఏర్పడిన ఈ వివాదం ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ దుమారంలో ట్విస్ట్.. సుప్రీం కోర్టుకు పంచాయితీ !

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated Date - 2023-05-25T15:34:15+05:30 IST