BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-04-11T16:38:19+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ

BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం
Narendra Modi , Sonia Gandhi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) ఓ పత్రికకు రాసిన వ్యాసంలో చేసిన విమర్శలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మోదీపై విద్వేషానికి ఇది గొప్ప ఉదాహరణ అని మండిపడింది. తప్పుడు ప్రాథమ్యాలకు, జాతీయ స్థాయిలో సంబంధాన్ని మితిమీరి అంచనా వేయడానికి ఈ వ్యాసం నిదర్శనమని తెలిపింది. దిక్కుతోచని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ మాత్రమేనని, దేశం కాదని స్పష్టం చేసింది. రాజకీయ సంక్షోభం అంచుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులు చాలా కీలకమైనవని తెలిపింది.

‘ది హిందూ’ పత్రిక కోసం సోనియా గాంధీ ఓ వ్యాసాన్ని రాశారు. దీనిని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంత ప్రయత్నించినా భారతీయుల గొంతు నొక్కలేరన్నారు. మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ చేసిన ఆలోచనలను రేకెత్తించే ఆరోపణలను చదవాలని కోరారు.

దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, మోదీపై విద్వేషానికి ఈ వ్యాసం గొప్ప ఉదాహరణ అని చెప్పారు. అదేవిధంగా తప్పుడు ప్రాథమ్యాలకు, జాతీయ స్థాయిలో సంబంధం ఉండటాన్ని అతిగా అంచనా వేశారనడానికి ఇది ఉదాహరణ అని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, దేశం కాదని తెలిపారు. రానున్న రోజులు రాజకీయ సంక్షోభం అంచుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కీలకమైనవని చెప్పారు.

సోనియా గాంధీ ఏమన్నారంటే...

కాంగ్రెస్ సభ్యుడిని మెరుపు వేగంతో పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటించారని సోనియా ఈ వ్యాసంలో ఆరోపించారు. ఆమె రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించలేదు. మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ శిక్ష పడిన వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఆయన కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో గెలిచారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయింది. జైలు శిక్ష అమలును కోర్టు నిలిపేసింది. ఆయన దాఖలు చేసిన అపీలును గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు బుధవారం విచారణ జరుపుతుంది.

సీబీఐ (Central Bureau of Investigation), ఈడీ (Enforcement Directorate) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని సోనియా గాంధీ ఈ వ్యాసంలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు ఈ సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కేసుల్లో 95 శాతం వరకు కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలపైనే నమోదవుతున్నాయన్నారు. బీజేపీలో చేరినవారిపై ఉన్న కేసులు విచిత్రంగా ఆవిరి అయిపోతున్నాయన్నారు. దేశ భద్రతకు ఉద్దేశించిన చట్టాల దుర్వినియోగం జరుగుతోందని, ఈ చట్టాలను పాత్రికేయులు, ఉద్యమకారులు, ప్రముఖ మేధావులపై ప్రయోగిస్తున్నారని తెలిపారు. ఇలా మునుపెన్నడూ జరగలేదన్నారు.

న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయన్నారు. కొందరు జడ్జిలు దేశ వ్యతిరేకులని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి భాషను వాడుతున్నారన్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం, తద్వారా ప్రస్తుత న్యాయమూర్తులను బెదిరించడమే వారి లక్ష్యమన్నారు.

మీడియాను కూడా రాజకీయంగా బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారి గొంతు నొక్కే విధంగా సాయంత్రం వేళల్లో టీవీల్లో చర్చలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) మౌనంగా ఉన్నంత మాత్రానికి పాలు, కూరగాయలు, గుడ్లు, వంట గ్యాస్, నూనె వంటి నిత్యావసరాలను కొనడానికి ఇబ్బందులు పడుతున్న కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆమె మౌనం నిరుద్యోగులకు ప్రయోజనకారి కాదని అన్నారు.

చట్ట సభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ మన దేశ ప్రజాస్వామ్యానికి మూడు ప్రధాన స్తంభాలని, మోదీ ప్రభుత్వం వీటిని పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తోందని అన్నారు. గొంతు నొక్కడం దేశ సమస్యలను పరిష్కరించదన్నారు. అదానీ-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను కూడా ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి :

RSS March: సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్..స్టాలిన్‌కు చెక్కెదురు..

Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్

Updated Date - 2023-04-11T16:38:19+05:30 IST