Rahul Gandhi: పార్లమెంట్‌లో తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం రాష్ట్రానికే అవమానం.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
ABN , First Publish Date - 2023-09-19T18:30:02+05:30 IST
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం.. రాష్ట్రాన్ని అవమానపరచడం లాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. “తెలంగాణ అమరులను..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం.. రాష్ట్రాన్ని అవమానపరచడం లాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. “తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ.. ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే” అంటూ మంగళవారం ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా రాహుల్ పోస్ట్ చేశారు. ఇందుకు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
కాగా.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించడం రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని.. ఈ విభజన రెండు రాష్ట్రాలనూ సంతృప్తి కలిగించలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందని, నూతన రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోదీ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్‌లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని.. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రాల విభజన జరిగిందని.. ఎంతో ప్రణాళికబద్ధంగా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అవి సంబరాలు జరుపుకున్నాయని.. కానీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం అలా సంబరాలు జరుపుకోలేకపోయాని మోదీ తెలిపారు. ఈ విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. ప్రధాని వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ప్రధాని చారిత్రక వాస్తవాలను విస్మరించారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం మోదీపై ధ్వజమెత్తుతూ.. పై విధంగా ట్వీట్ చేశారు.