Share News

Rahul Gandhi: బీజేపీ, బీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ.. వాళ్లు లోపల, బయట కలిసే ఉన్నారు

ABN , First Publish Date - 2023-10-18T22:32:50+05:30 IST

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నాయి....

Rahul Gandhi: బీజేపీ, బీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ.. వాళ్లు లోపల, బయట కలిసే ఉన్నారు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించే హామీలు ఇస్తూనే.. తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ సైతం.. ఎన్నికల ప్రచారంలో తన పూర్తి బలం చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని.. పార్లమెంట్ లోపల, బయట అవి కలిసే ఉంటున్నాయని అన్నారు.


తెలంగాణలో ఎన్నికల పోటీ కేవలం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ పార్టీని తాము పక్కన పెట్టేశామని, అంటే దానిని ఓడించేశామని ఉద్ఘాటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ విజయం సాధించాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే బీఆర్ఎస్‌తో ఆ పార్టీ చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఏఐఎంఐఎం కూడా ఆ రెండు పార్టీలతో కుమ్మక్కయ్యిందని.. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని భావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీ ఏది కోరుకుంటే అది బీఆర్‌ఎస్ చేసిందని.. రైతు బిల్లు, జీఎస్టీ బిల్లులకు అది పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్‌పై తన రాజకీయ దాడుల్ని రాహుల్ గాంధీ మరింత పెంచుతూ.. ఆయనపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులతో ఎలాంటి విచారణ జరగడం లేదన్నారు. అంటే.. తెలంగాణ సీఎంపై సీబీఐ లేదా ఈడీ ఎలాంటి కేసు నమోదు చేయలేదని, అదే సమయంలో ప్రతిపక్ష నేతలందరిపై మాత్రం కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చన్నారు. తనపై 24 కేసులు ఉన్నాయన్న రాహుల్.. తన ఇల్లు, లోక్‌సభ సభ్యత్వం కూడా లాగేసుకున్నారన్నారు. కానీ.. కేసీఆర్‌పై మాత్రం ఏ కేసు లేదని, కేసీఆర్‌కు ఓటేస్తే అది బీజేపీకి పోతుందని వెల్లడించారు.

Updated Date - 2023-10-18T22:32:50+05:30 IST