Modi Posters : మోదీ పోస్టర్ల వివాదం... ఆరుగురి అరెస్ట్...

ABN , First Publish Date - 2023-03-22T11:08:48+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వ్యతిరేకంగా గోడ పత్రికలు (Wall Posters)ను అంటించిన కేసులో

Modi Posters : మోదీ పోస్టర్ల వివాదం... ఆరుగురి అరెస్ట్...
Delhi City

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వ్యతిరేకంగా గోడ పత్రికలు (Wall Posters)ను అంటించిన కేసులో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ అభ్యంతరకరమైన పోస్టర్లకు సంబంధించి దాదాపు 100 ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లను నమోదు చేశారు. కొన్ని పోస్టర్లలో ‘‘మోదీని తప్పించండి, దేశాన్ని కాపాడండి’’ అని ఉంది. స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ ఈ వివరాలను వెల్లడించారు.

మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఈ పోస్టర్లను అంటించినవారిపై ప్రింటింగ్ ప్రెస్ యాక్ట్, డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌ల ప్రకారం కేసులను నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పోస్టర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న ఓ వ్యాన్‌ను తనిఖీ చేసినపుడు, అందులో ఇటువంటి పోస్టర్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా స్పందించింది. ఆ పార్టీ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఈ పోస్టర్లలో అంత అభ్యంతరకరమైనది ఏముంది? మోదీ 100 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయించేటంత అభ్యంతరకరమైనది ఏముంది? అని ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వ నియంతృత్వం శిఖరస్థాయికి చేరిందని మండిపడింది. ‘‘మోదీ! మీకు బహుశా తెలిసి ఉండదు, కానీ భారత దేశం ప్రజాస్వామిక దేశం’’ అని పేర్కొంది. ఓ పోస్టర్‌ని చూసి అంత భయపడాలా? అని ఎద్దేవా చేసింది. ‘‘మోదీ హటావో, దేశ్ బచావో’’ అని ఉన్న పోస్టర్‌ను కూడా జత చేసింది.

ఇదిలావుండగా, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తయారు చేసిన వివాదాస్పద పోస్టర్లను ఢిల్లీలో 50 వేలకు పైగా అంటించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో సుమారు రెండు వేల పోస్టర్లతో ఉన్న ఒక వ్యాన్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు. తెలంగాణకు చెందిన ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం

ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. మౌలిక సదుపాయాలు, ప్రకటనలపై ఖర్చు చేసేందుకు నిధుల కేటాయింపు గురించి వివరణ ఇవ్వాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. చివరికి ఈ బడ్జెట్‌కు మంగళవారం ఆమోదం తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఎటువంటి మార్పులు లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం తెలిపిందని, అంతమాత్రానికి కొన్ని రోజులపాటు ఆమోదం తెలపకుండా ఎందుకు ఆపి ఉంచారని ప్రశ్నించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిగిన వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమర్పించలేదని ఆరోపించారు. చౌకబారు ప్రచారం కోసమే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను షెడ్యూలు ప్రకారం మంగళవారం శాసన సభలో ప్రవేశపెట్టవలసి ఉంది. దీనికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంగళవారం ఆమోదం తెలపడంతో దీనిని బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టబోతున్నారు.

ఇవి కూడా చదవండి :

Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ

Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా

Updated Date - 2023-03-22T11:32:56+05:30 IST