9 Years Modi Govt : ప్రతి నిర్ణయం ప్రజా జీవితాల మెరుగుదల కోసమే : మోదీ
ABN , First Publish Date - 2023-05-30T12:58:36+05:30 IST
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న ప్రతి నిర్ణయం, చేసిన ప్రతి పని ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకేనని
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న ప్రతి నిర్ణయం, చేసిన ప్రతి పని ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నందుకు తన మనసు అణకువ, కృతజ్ఞతలతో నిండిపోయిందన్నారు. మోదీ రెండోసారి ప్రధాన మంత్రిగా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
మోదీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నామని, తన మనసు అణకువ, కృతజ్ఞతలతో నిండిపోయిందని తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఆకాంక్షే ఈ తొమ్మిదేళ్లలో తన ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి, చేసిన ప్రతి పనికి మార్గదర్శకమని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించేందుకు తాము మరింత శ్రమించి కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించారు. దేశాభివృద్ధి కోసం తొమ్మిదేళ్లపాటు సడలని పట్టుదలతో, అంకితభావంతో కృషి చేసినట్లు చెప్పారు.
పేదల సంక్షేమం : అమిత్ షా
కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా (Union Home Minister Amit Shah) ఇచ్చిన ట్వీట్‌లో, నేడు ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని, ప్రపంచంలో దేశం హోదా సమున్నత స్థాయికి చేరుతోందని; మరోవైపు ప్రభుత్వానికి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల నూతన లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.
ప్రజలపై నమ్మకం : నిర్మల సీతారామన్
మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ముంబైలో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంస్కరణలను వివరించారు. ప్రస్తుతం పన్నుల విధానాన్ని ఫేస్‌లెస్ చేశామని, దీనికి కారణం ప్రజలపై తమకు నమ్మకం ఉండటం, ప్రజలకు మోదీపై నమ్మకం ఉండటం అని చెప్పారు.
అభివృద్ధిలో నూతన అధ్యాయం : షెకావత్
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్లలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలో నూతన అధ్యాయాన్ని రాసిందన్నారు. భారత దేశ పేరు, ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయన్నారు. దేశ భద్రత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సురక్షిత తాగునీటిని కొళాయిల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి :
Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి
Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు