Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2023-05-30T11:55:20+05:30 IST

నేత మనీశ్ సిసోడియా )కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది.

Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
Manish Sisodia, AAP

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI) దాఖలు చేసిన ఈ కేసులో ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని కోర్టు తెలిపింది. జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ఈ తీర్పు ఇచ్చారు.

సీబీఐ దాఖలు చేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియాకు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సిసోడియా పలుకుబడిగల నేత అని, ఆయన అధికారులను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నారని, సాక్షుల్లో ఎక్కువ మంది ప్రభుత్వోద్యోగులు కాబట్టి, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. సిసోడియాపై ఆరోపణలు చాలా తీవ్ర స్వభావం కలవని తెలిపింది. సౌత్ గ్రూప్ చెప్పినట్లుగా దురుద్దేశంతో ఈ మద్యం విధానాన్ని రూపొందించారని, సౌత్ గ్రూప్‌నకు అనుచిత ప్రయోజనాలను కలిగించే విధంగా దీనిని రూపొందించారని వచ్చిన ఆరోపణలు చాలా తీవ్ర స్వభావం కలవని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశాన్ని తోసిపుచ్చలేమని తెలిపింది. సిసోడియా, సీబీఐ వాదనలను విన్న తర్వాత మే 11న ఈ తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కుంభకోణం (Delhi Excise Policy, 2021-22) కేసులో సీబీఐ ఛార్జిషీటులో మనీశ్ సిసోడియాను నిందితునిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. రెండు ఫోన్లను తాను ధ్వంసం చేసినట్లు సిసోడియా అంగీకరించారని అనుబంధ ఛార్జిషీటులో సీబీఐ తెలిపింది.

మనీశ్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు చేస్తున్నాయి. సీబీఐ కేసులో ఆయన బెయిలు దరఖాస్తును స్పెషల్ జడ్జి మార్చి 31న తిరస్కరించారు. ఈడీ కేసులో ఆయన బెయిలు దరఖాస్తును ట్రయల్ కోర్టు ఏప్రిల్ 28న తోసిపుచ్చింది. ఈడీ కేసులో ఆయన బెయిలు దరఖాస్తు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

సీబీఐ కేసులో రెగ్యులర్ బెయిలు కోసం దరఖాస్తు చేసిన సిసోడియా డబ్బుకు సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదని వాదించారు. అయితే సీబీఐ వాదనలు వినిపిస్తూ, ఇది చాలా లోతుగా పాతుకుపోయిన కుట్ర అని తెలిపింది. అనేక అంచెలుగా కుట్ర జరిగిందని, దీనిని బయటపెట్టేందుకు సిసోడియా సహకరించడం లేదని తెలిపింది. దర్యాప్తులో తప్పించుకునేందుకు ప్రయత్నించారని తెలిపింది. కార్యనిర్వాహక శాఖ, ప్రభుత్వోద్యోగులతో సిసోడియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని కొనసాగిస్తున్నారని తెలిపింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సిసోడియా బాధితుడని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

ఈడీ చేసిన ఆరోపణల ప్రకారం, ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగింది. ప్రైవేటు కంపెనీలకు 12 శాతం లాభాలు ఇచ్చే విధంగా కుట్ర పన్ని దీనిని రూపొందించి, అమలు చేశారు. మంత్రుల బృందం సమావేశాల్లో చర్చనీయాంశంగా దీనిని పేర్కొనలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల తరపున విజయ్ నాయర్ ఈ కుట్రను సమన్వయపరిచారు.

తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈ కేసులో ఈడీ ప్రశ్నించింది. ఇటీవల ఛార్జిషీట్లలో ఆమె పేరు లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులు అప్రూవర్లుగా మారి, దర్యాప్తు సంస్థలకు సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజా సమాచారం.

ఇవి కూడా చదవండి :

UAE: ప్ర‌పంచంలో ఎక్కడి నుంచైనా ఎమిరేట్స్ ఐడీ, పాస్‌పోర్టులను రెన్యువల్ చేసుకునే వీలు.. యూఏఈ కొత్త సర్వీస్..!

Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి

Updated Date - 2023-05-30T11:55:20+05:30 IST