Pakistan : పెషావర్ ఆత్మాహుతి దాడి... పాకిస్థాన్‌లో భద్రతా సంక్షోభం...

ABN , First Publish Date - 2023-01-31T15:40:25+05:30 IST

రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం

Pakistan : పెషావర్ ఆత్మాహుతి దాడి... పాకిస్థాన్‌లో భద్రతా సంక్షోభం...
Peshawar Mosque attack

ఇస్లామాబాద్ : రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి ఇటీవలి సంవత్సరాల్లో ఈ దేశంలో జరిగిన భారీ దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ నగరంలో పాకిస్థానీ తాలిబన్లు (తెహరీక్-ఈ-తాలిబన్) తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ రెండు దేశాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థగా దీనిని అమెరికా ప్రకటించింది.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్ రాజధాని నగరం పెషావర్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 92కు చేరినట్లు పోలీసులు తెలిపారు. పెషావర్ డిప్యూటీ కమిషనర్ సఫియుల్లా ఖాన్ మంగళవారం మాట్లాడుతూ, ఈ దాడిలో 92 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 80 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఈ దాడిలో గాయపడి, ప్రాణాపాయం నుంచి బయటపడిన పోలీసు అధికారి నసరుల్లా ఖాన్ మాట్లాడుతూ, మొదట పెద్ద ఎత్తున మంటలు కనిపించాయని, ఆ తర్వాత నల్లని ధూళి కమ్ముకుందని చెప్పారు. మసీదు పై కప్పు కూలిపోయిందని, దానికి, గోడకు మధ్య తాను దాదాపు మూడు గంటలపాటు చిక్కుకుపోయానని తెలిపారు.

ఇదిలావుండగా, శిథిలాల క్రింద చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు ఆవిరి అయిపోయాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలు మాత్రమే బయటపడుతున్నాయని చెప్పారు. ఈ మసీదులో సాయంకాలం ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో అత్యధికులు పోలీసులు, భద్రతా సిబ్బంది అని తెలిపారు.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించడం, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని దాటుకుని మరింత పైకి ఎగబాకడం, రాజకీయ నాయకత్వం బలంగా లేకపోవడం ఆ దేశాన్ని వేధిస్తున్నాయి. మిత్ర దేశాల నుంచి రుణాలను నామమాత్రపు నిబంధనలతో తెచ్చుకుందామని ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బృందం పాక్‌లో మంగళవారం పర్యటించబోతోంది. దీనిపైనే పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Updated Date - 2023-01-31T15:40:30+05:30 IST