Turkey: టర్కీలో భూకంపం... ఏపీలోని ఈ జిల్లాలో వణుకు!...

ABN , First Publish Date - 2023-02-08T15:50:13+05:30 IST

భూకంపాలతో తల్లడిల్లుతున్న టర్కీలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. భారత దేశంతో సహా అనేక దేశాలు కష్టకాలంలో

Turkey: టర్కీలో భూకంపం... ఏపీలోని ఈ జిల్లాలో వణుకు!...
Turkey Earthquake

శ్రీకాకుళం : తీవ్ర భూకంపాల ధాటికి తల్లడిల్లుతున్న టర్కీలో ఏ శిథిలాన్ని కదిలించినా విగతజీవులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులను పిల్లల రోదనలు, ఆప్తులను కోల్పోయిన వేదనలు కలచివేస్తున్నాయి. విద్యుత్తు, టెలిఫోన్, తాగునీరు, ఆహారం వంటివాటికి దూరమై అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా ఈ హృదయవిదారక దృశ్యాలే మెలిపెడుతున్నాయి. అయితే ఈ బాధ టర్కీ వరకే పరిమితమవ్వలేదు. టర్కీలో ఉన్న తమవారి సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మీయులు ఎక్కడ ఉన్నారో, సజీవంగా ఉన్నారో, నిర్జీవంగా ఉన్నారో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు కంగారుపడుతున్నారు. ఇలా ఆవేదన చెందుతున్నవారిలో తెలుగువారు కూడా ఉన్నారు. పొట్ట చేత పట్టుకుని ఏడాదిక్రితం ఏపీలోని శ్రీకాకుళం నుంచి టర్కీ వెళ్లినవారి కోసం కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పొట్ట చేత పట్టుకుని ఓ ఏడాది క్రితం ఉపాధి కోసం టర్కీ వెళ్ళిన శ్రీకాకుళంవాసులు ఈ భూకంపాల వల్ల బాధితులుగా మారారు. కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన అనేక మంది టర్కీలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా ఆందోళన ఛాయలు అలుముకున్నాయి. అయితే వీరంతా భూకంప ప్రభావిత ప్రాంతానికి సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాము క్షేమంగానే ఉన్నామని వీరు తమ స్వస్థలాల్లోని బంధుమిత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారి స్వస్థలాల్లోని వారి బంధుమిత్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

భారత్ అండదండలు

భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారత దేశం సన్నాహాలు చేస్తోంది. అత్యంత భారీ రవాణా విమానం సీ-17లో సహాయక సామాగ్రిని పంపించబోతోంది. అయితే పాకిస్థాన్ తన నీచ బుద్ధిని విడనాడకుండా, తన గగనతలంపై నుంచి ఈ విమానం వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ విమానం ఇరాన్ మీదుగా మరింత ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి టర్కీలో పర్యటించేందుకు అనుమతి రాలేదు.

భారత దేశం ఇప్పటికే ఇండియన్ మిలిటరీ విమానం సీ-17లో నాలుగుసార్లు తుర్కియేకు, ఒకసారి సిరియాకు మానవతావాద సహాయాన్ని అందించింది. మొత్తం మీద ఈ రెండు దేశాలకు ఇప్పటి వరకు మందులు, పరికరాలు వంటి 108 టన్నుల సహాయక సామాగ్రిని అందజేసింది, ఈ విమానాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్ కూడా వెళ్లాయి.

మృతుల సంఖ్య 9,500...

మరోవైపు టర్కీ, సిరియా దేశాల్లో ఈ నెల 6న సంభవించిన భూకంపాల వల్ల ప్రాణనష్టం భారీగా ఉంది. ఇప్పటికే 9,500కు పైగా మృతదేహాలను గుర్తించారు. భవనాల శిథిలాల క్రింద చిక్కుకుని ప్రాణాలతో ఎవరైనా ఉన్నారేమో చూసేందుకు సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. గడ్డకట్టించే చలి వాతావరణాన్ని ఎదిరించి క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నాయి.

టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. ఇంత భారీ విధ్వంసం జరిగినప్పటికీ మే నెలలో సాధారణ ఎన్నికలను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

Updated Date - 2023-02-08T16:27:26+05:30 IST