Caste-based survey : బిహార్‌లో కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను నిలిపేసిన పాట్నా హైకోర్టు
ABN , First Publish Date - 2023-05-04T17:33:12+05:30 IST
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court) గురువారం ఝలక్ ఇచ్చింది.
పాట్నా : ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court) గురువారం ఝలక్ ఇచ్చింది. కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా కాపాడాలని తెలిపింది. ఈ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఆదేశించింది.
కుల ఆధారిత జనాభా లెక్కలను సేకరించేటపుడు వ్యక్తిగత గోప్యత హక్కును పట్టించుకోలేదని బిహార్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిశీలించినపుడు, రాష్ట్రంలో సేకరించిన సమాచారాన్ని శాసన సభలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పంచుకొనే ఉద్దేశం కనిపిస్తోందని చెప్పింది. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని తెలిపింది.
హైకోర్టు ఆదేశాలపై బీజేపీ స్పందిస్తూ, నితీశ్ కుమార్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాన్ని రూపొందించిందని ఆరోపించింది. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్‌కిశోర్ ప్రసాద్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సరైన వాదనలను వినిపించలేదన్నారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందిస్తూ, పాట్నా హైకోర్టు ఆదేశాలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. రాష్ట్రీయ లోక్ జనతా దళ్ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ, రిట్ పిటిషన్ దాఖలైనప్పటి నుంచి ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించిందన్నారు.
సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ, కుల ఆధారిత జనాభా లెక్కలను సేకరించడం చాలా అవసరమని, బిహార్ ప్రభుత్వం అపీలు చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ, కుల ఆధారిత జనాభా లెక్కలను సేకరించడం వల్ల పేద ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. నితీశ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుల ఆధారిత సర్వేకు కట్టుబడి ఉన్నారని, తాము దీనిని అమలు చేస్తామని చెప్పారు.
నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి కుల ఆధారిత సర్వేను ప్రారంభించింది. రెండు దశలలో ఈ సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది. తొలి దశ జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దశ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైంది, మే 15తో పూర్తవుతుందని అంచనా. దీనికి రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం