G20 Dinner : జీ20 దేశాధినేతలకు బంగారు, వెండి పాత్రల్లో విందుపై నెటిజన్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-09-08T13:36:04+05:30 IST

జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

G20 Dinner : జీ20 దేశాధినేతలకు బంగారు, వెండి పాత్రల్లో విందుపై నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ : జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఓవైపు నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటే, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

జీ20 సదస్సుకు ఈ ఏడాది భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ఈ సమావేశాలు జరుగుతాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరందరికీ శనివారం రాత్రి విందు ఇస్తారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు, వెండి పాత్రల్లో రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డించడం కోసం ఏర్పాట్లు జరిగాయి. ఈ పాత్రలను తయారు చేసిన ఐఆర్ఐఎస్ ఇండియా సీఈఓ రాజీవ్ పబువల్ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని పాత్రలకు బంగారు పూత, మరికొన్నిటికి వెండి పూత పూశారు. ప్రాంతానికి అనుగుణంగా చెమ్చాలు, గరిటెలు, కంచాలు, పళ్లేలు వంటివాటిని తయారు చేశారు. ‘మహారాజా థాలి’ వీటిలో ప్రముఖమైనది.

ఈ నేపథ్యంలో @DearthOfSid ఇచ్చిన ట్వీట్‌లో, జీ20 దేశాల సమక్షంలో ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడం అర్థరహితం, ఘోరం, సిగ్గుచేటు అని మండిపడ్డారు. భారత దేశంలో పేదరికం గురించి వారికి తెలిసిందే! పైపైన కనిపించే ఇలాంటి అహంకారపూరిత ప్రదర్శనలను నిరుత్సాహపరచాలన్నారు.

మరో యూజర్ @Advaidism పెట్టిన పోస్ట్‌లో, ‘‘జనాభాలో 80 శాతం మంది ఉచిత రేషన్ సరుకులపై ఆధారపడే ప్రజలు ఉన్న దేశంలో, మురికివాడలు కనిపించకుండా ఆకుపచ్చని గుడ్డలతో కప్పివేస్తున్న దేశంలో, విదేశీ ప్రతినిధులు బంగారు పూత పూయబడిన పాత్రల్లో తింటారు. ప్రజాధనాన్ని సిగ్గులేకుండా ఖర్చు చేస్తున్నారు. 21వ శతాబ్దపు నీరోలు’’ అని దుయ్యబట్టారు.

మరో యూజర్ @softgrowl పెట్టిన పోస్ట్‌లో, మనం చెల్లిస్తున్న పన్నులను ప్రధాని మోదీ ఇలా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీదైన బహుమతులు, విందులతో విదేశీ ప్రతినిధులను ఆకర్షించాలనుకుంటున్నారన్నారు. పేదలు ఆహారం కోసం అనేక అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 కోట్ల మంది భారతీయులకు కనీసం టేబుల్ కూడా లేదని, వీరంతా బియ్యం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T13:36:04+05:30 IST