Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

ABN , First Publish Date - 2023-06-08T10:29:52+05:30 IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేసిన ‘మైనర్’ రెజ్లర్ కోర్టులో తన స్టేట్‌మెంట్‌ను సవరించారు.

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్
Brij Bhushan Sharan Singh

న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Wrestling Federation of India chief Brij Bhushan Sharan Singh)పై ఆరోపణలు చేసిన ‘మైనర్’ రెజ్లర్ కోర్టులో తన స్టేట్‌మెంట్‌ను సవరించారు. సంఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను కాదని, మేజర్‌నేనని తెలిపారు. ఆమె తండ్రి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, తన కుమార్తె వయసుకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను మాత్రమే మార్చారని, లైంగిక వేధింపుల ఆరోపణలు యథాతథంగా ఉన్నాయని చెప్పారు. గతంలో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై పోక్సో (POCSO) చట్టం క్రింద కేసు నమోదు చేశారు.

‘మైనర్’ రెజ్లర్ ఫిర్యాదు మేరకు లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (POCSO) ప్రకారం బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదైంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 10 ప్రకారం ఆయనపై కేసు నమోదవడంతో ఆరోపణలు రుజువైతే ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. తాను మేజర్‌నని ఆమె కొత్తగా స్టేట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసు తొలగిపోయే అవకాశం ఉంది. ఇదిలావుండగా, మరో వార్తా సంస్థ కథనం ప్రకారం, ‘మైనర్’ రెజ్లర్ తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తె జూన్ 5న ఢిల్లీ మేజిస్ట్రేట్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. తన కుమార్తెపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కేవలం పక్షపాతంతో వ్యవహరించారని చెప్పారు. ఆసియన్ చాంపియన్‌షిప్‌ కోసం గత ఏడాది ట్రయల్స్‌లో చిట్టచివరి దశలో తన కుమార్తె ఉత్తీర్ణత సాధించకపోవడంతో తమకు కోపం వచ్చిందని, అందుకే ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించామని చెప్పారు. అంతకుముందు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోలేదని, కేవలం కొత్త స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని చెప్పారు.

బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ల ఉద్యమం నాలుగు నెలల క్రితం ప్రారంభమైంది. వీరి ఆరోపణలపై ఏప్రిల్ 29న ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆయనపై మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ చర్చలు సఫలం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహిళా రెజ్లర్లతో శనివారం చర్చలు జరిపారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రెజ్లర్లతో బుధవారం చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై దర్యాప్తు పూర్తి చేసి, జూన్ 15నాటికి ఛార్జిషీటు దాఖలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అంతేకాకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అధికార మార్పిడికి అంగీకరించింది. ఈ ఫెడరేషన్‌కు త్వరలో జరిగే ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుటుంబ సభ్యులు పోటీ చేయకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులను భర్తీ చేసేటపుడు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఠాకూర్‌తో ఆరు గంటలపాటు జరిగిన చర్చల్లో రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ పాల్గొన్నారు.

చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జూన్ 30నాటికి జరగవలసి ఉందని చెప్పారు. ఈ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తామని, దీనికి ఓ మహిళను అధ్యక్షురాలిగా నియమిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత మంచి ఆఫీసు బేరర్లు ఉన్న మంచి ఫెడరేషన్‌గా పని చేస్తుందన్నారు. క్రీడాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి :

యూపీలో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్‌ హత్య

Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి

Updated Date - 2023-06-08T10:29:52+05:30 IST