Share News

Madhya pradesh polls 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

ABN , First Publish Date - 2023-11-11T16:54:27+05:30 IST

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి.శర్మ పాల్గొన్నారు.

Madhya pradesh polls 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Assembly Polls) మేనిఫెస్టో (Manifesto)ను బీజేపీ (BJP) శనివారంనాడు విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి.శర్మ పాల్గొన్నారు.


మేనిఫెస్టో విడుదల అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్ 14 రెట్లు పెరిగిందని, రాష్ట్ర జీడీపీ 19 రెట్లు పెరిగిందని చెప్పారు. రిపోర్ట్ కార్డ్ రాజకీయాలను తాము నమ్ముతామని, ఏదైతే చెప్పామో అదే చేస్తామని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రోడ్ మ్యాప్‌గా ప్రధానమంత్రి మోదీ ఇస్తున్న గ్యారెంటీ ఈ మేనిఫెస్టో అని చెప్పారు. ఏవైతే తాము హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చామన్న సంతృప్తి తనకు ఉందన్నారు. గర్భంలోని అడశిశువులను చంపేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చినప్పుడు 'లాడ్లీ లక్ష్మీ యోజన' ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.


కాగా, 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. బీజేపీ, ఎస్‌పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ తిరిగి 2020 మార్చిలో శివరాజ్ సింగ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 127గా ఉంది.

Updated Date - 2023-11-11T16:54:29+05:30 IST