India Vs Canada : ఖలిస్థానీల ప్రదర్శనలో ఇందిరా గాంధీ శకటం.. కెనడాను హెచ్చరించిన భారత్..

ABN , First Publish Date - 2023-06-08T15:12:05+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన కెనడా ప్రభుత్వంపై భారత ప్రభుత్వం మండిపడింది.

India Vs Canada : ఖలిస్థానీల ప్రదర్శనలో ఇందిరా గాంధీ శకటం.. కెనడాను హెచ్చరించిన భారత్..

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన కెనడా ప్రభుత్వంపై భారత ప్రభుత్వం మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటివాటిని అనుమతించడం వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై విపరీత ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ అంశంపై కాంగ్రెస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ చరిత్రను గౌరవించాలని, కెనడా ప్రభుత్వంతో దీనిపై చర్చించాలని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను కోరింది.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు జూన్ 4న ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 5 కిలోమీటర్ల మేరకు జరిగిన ప్రదర్శనలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రదర్శించారు. రక్తపు మరకలతో కూడిన తెల్ల చీర ధరించిన ఇందిరపై తలపాగాలు ధరించిన గన్‌మెన్ కాల్పులు జరుపుతున్నట్లు ప్రదర్శించారు. ఈ శకటంలో ఉన్న పోస్టర్‌లో ‘ప్రతీకారం’ అని రాశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను బాలరాజ్ డియోల్ అనే ఓ ట్విటరాటీ ట్వీట్ చేశారు.

దీనిపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) గురువారం విలేకర్ల సమావేశంలో స్పందిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకపోతే, ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారో నిజంగా అర్థంకాదన్నారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించేవారు విస్తృతంగా అవకాశం పొందుతున్నారని, ఇది నిగూఢంగా ఉన్న సమస్య అని, దీనిని మనం పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇలా చేయడం ఇరు దేశాల మధ్య సంబంధాలకు, కెనడాకు మంచిది కాదన్నారు. ‘‘వారి చరిత్రను పరిశీలించినపుడు, దాని నుంచి వారు నేర్చుకుంటారని మీరు భావిస్తారు. ఆ చరిత్రను పునరావృతం చేయాలని వారు కోరుకోరని భావిస్తారన్నారు.

కాంగ్రెస్ స్పందన

కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా ఇచ్చిన ట్వీట్‌లో, కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను ప్రదర్శిస్తూ ఐదు కిలోమీటర్ల మేరకు సాగిన ప్రదర్శన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇది ఎవరో ఒకరికి అనుకూలంగా ఉండటం గురించి కాదన్నారు. ఓ దేశ చరిత్రను గౌరవించడానికి, ఆ దేశ ప్రధాన మంత్రిని హత్య చేయడం వల్ల కలిగిన బాధ, ఆవేదనలకు సంబంధించినదని చెప్పారు. ఈ తీవ్రవాదాన్ని ప్రపంచం ఖండించాలన్నారు. దీనిపై ఐకమత్యంగా స్పందించాలన్నారు.

మిలింద్ దేవరాను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఓ ట్వీట్‌లో సమర్థించారు. తాను మిలింద్ దేవరాతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, దీనిపై కెనడా అధికారులతో మాట్లాడాలని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను కోరారు.

భారత ప్రభుత్వ స్పందన

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలిపింది. ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఓ ఫార్మల్ నోట్‌ను పంపించింది. ఇటువంటి చర్యలు ఆమోదించదగినవి కాదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం పరిధిని అతిక్రమించకూడదని తెలిపింది. ఓ ప్రజాస్వామిక దేశపు నాయకురాలి హత్యను ఘనంగా కీర్తిస్తూ పెరేడ్ నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

కెనడియన్ హై కమిషనర్ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీలోని కెనడియన్ హై కమిషనర్ కామెరూన్ మెక్‌కే గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యను కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంబరంగా జరుపుకున్నట్లు వచ్చిన వార్తలను చూసి, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. విద్వేషానికి, హింసను ఘనంగా కీర్తించడానికి కెనడాలో స్థానం లేదన్నారు. తాను ఈ చర్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఎందుకు ఇలా..?

‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భాగంగా 1984 జూన్ 6న భారతీయ దళాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాయి. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా హత్య చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఓ పెరేడ్‌ను నిర్వహించినట్లు తెలిపే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 39 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ పెరేడ్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పెరేడ్‌లో ఇందిరా గాంధీతోపాటు, ఆమెను హత్య చేసినవారి బొమ్మలను కూడా పెట్టారు. ఇందిర హత్య తీరును వర్ణిస్తూ ఈ పెరేడ్‌ జరిగింది. శ్రీ దర్బార్ సాహిబ్‌పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఈ శకటంలోని పోస్టర్లో రాశారు.

ఇవి కూడా చదవండి :

Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

Updated Date - 2023-06-08T15:12:05+05:30 IST