Eradicate Sanatana : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ మద్దతు..

ABN , First Publish Date - 2023-09-03T10:40:13+05:30 IST

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు.

Eradicate Sanatana : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ మద్దతు..
Karti Chidambaram, Udayanidhi

చెన్నై : సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు. సనాతన ధర్మం ఈ దేశానికి పెను శాపమని చెప్పారు.

ఉదయనిధి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు. ఆయన తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన శనివారం ఓ సంస్థ నిర్వహించిన సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రత్యేక ప్రసంగం ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈ సమావేశానికి మీరు ‘సనాతన వ్యతిరేక సదస్సు’ అని కాకుండా ‘సనాతన నిర్మూలన సదస్సు’ అని పేరు పెట్టారు. అందుకు మిమ్మల్ని నేను ప్రశంసిస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘కొన్నిటిని కేవలం వ్యతిరేకించకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. మనం డెంగ్యూను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. మనం వీటిని నిర్మూలించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’’ అన్నారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు వ్యతిరేకమని చెప్పారు.


ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారన్నారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని అభిప్రాయపడుతున్నారన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారని, వారిని సామూహికంగా హత్య చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే ముఖ్యమైన పార్టీ అని, కాంగ్రెస్‌తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉందని తెలిపారు. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ గురించి మాట్లాడుతూ ఉంటారని, కానీ కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే వారసుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారని అన్నారు. కాంగ్రెస్ మౌనంగా ఉండటమంటే సామూహిక జనహననానికి ఇచ్చిన పిలుపును సమర్థించినట్లేనని తెలిపారు. ఐ.ఎన్.డీ.ఐ కూటమి దాని పేరుకు తగినట్లుగానే, అవకాశం వస్తే, వేలాది సంవత్సరాల ప్రాచీన నాగరికత అయిన భారత్‌ను సర్వనాశనం చేస్తుందన్నారు.

అమిత్ మాలవీయ ట్వీట్‌పై ఉదయనిధి స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తాను తన మాటలకు కట్టుబడి ఉన్నానని, అయితే సనాతన ధర్మాన్ని పాటించేవారిని చంపాలని తాను అనలేదని అన్నారు. సనాతన ధర్మం వల్ల బాధితులైన అణగారిన వర్గాలవారి తరపున తాను మాట్లాడానని చెప్పారు. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనడానికి తాను సిద్ధమేనని చెప్పారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కుమారుడు, ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ఇచ్చిన ట్వీట్‌లో, తమిళనాడులో సామాన్యంగా వాడుకలో ఉన్నదేమిటంటే, సనాతన ధర్మం అంటే కుల ప్రాతిపదికపై ఎక్కువ స్థాయి, తక్కువ స్థాయిగల వ్యక్తులు ఉండే సమాజం గురించి చెప్పే నిబంధనావళి మాత్రమేనన్నారు. దీనిని సమర్థించేవారంతా ఆ పాత రోజులను బలంగా కోరుకునేవారేనన్నారు. కులం భారత దేశానికి శాపమని చెప్పారు.

సనాతన ధర్మాన్ని సమర్థించే ప్రతి ఒక్కరూ అగ్ర కులం, నిమ్న కులం పద్ధతి వల్ల లబ్ధి పొందినవారే ఎందుకు అవుతున్నారు? అని ప్రశ్నించారు. సామూహిక జనహననానికి ఎవరూ పిలుపునివ్వలేదని, ఉదయనిధి వ్యాఖ్యలను మోసపూరితంగా మెలి తిప్పారని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి :

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్

Updated Date - 2023-09-03T10:40:13+05:30 IST