Hinduphobia : హిందువులపై ఇలాంటి చట్టం చేసిన తొలి అమెరికన్ రాష్ట్రం జార్జియా

ABN , First Publish Date - 2023-04-01T19:31:38+05:30 IST

అత్యంత పురాతన హిందూ మతంపై అమెరికా (America), ఆస్ట్రేలియా (Australia), కెనడా (Canada) వంటి దేశాల్లో నిష్కారణంగా వ్యతిరేకత

Hinduphobia : హిందువులపై ఇలాంటి చట్టం చేసిన తొలి అమెరికన్ రాష్ట్రం జార్జియా
Georgia, America

వాషింగ్టన్ : అత్యంత పురాతన హిందూ మతంపై అమెరికా (America), ఆస్ట్రేలియా (Australia), కెనడా (Canada) వంటి దేశాల్లో నిష్కారణంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హిందూ మతంపై అనవసరమైన భయాలు పెట్టుకోవద్దని అమెరికాలోని జార్జియా రాష్ట్రం స్పష్టం చేసింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని జార్జియా అసెంబ్లీ ఆమోదించింది. ఇటువంటి తీర్మానం చేసిన తొలి అమెరికన్ రాష్ట్రం ఇదే కావడం విశేషం.

హిందూఫోబియాను, హిందూ మతాన్ని అవలంబించేవారిపై నిష్కారణంగా వ్యతిరేక భావాలను కలిగియుండటాన్ని ఈ తీర్మానం ఖండించింది. హిందూ మతం ప్రపంచంలో అత్యంత పెద్ద మతాల్లో ఒకటి అని, ఇది అత్యంత ప్రాచీన మతాల్లో ఒకటి అని తెలిపింది. సుమారు 100 దేశాల్లో దాదాపు 120 కోట్ల మంది ఈ మతాన్ని అవలంబిస్తున్నారని తెలిపింది. ఈ మతంలో వైవిద్ధ్యభరితమైన సంప్రదాయాలు ఉన్నాయని, వేర్వేరు విశ్వాసాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా విభిన్న సంప్రదాయాలు, విశ్వాసాలు కలవారి మధ్య పరస్పర గౌరవం, శాంతి, సామరస్యాలు, పరస్పర సమ్మతి ఉన్నట్లు తెలిపింది.

రిప్రజెంటేటివ్స్ లౌరెన్ మెక్‌డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వీరు అట్లాంటా సబర్బ్‌స్‌లోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు. జార్జియాలో హిందువులు, ఇండియన్-అమెరికన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి.

ఔషధాలు, సైన్స్, ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆతిథ్యం, ఆర్థికం, విద్య, మాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, రిటెయిల్ ట్రేడ్ వంటి అనేక రంగాల్లో అమెరికన్-హిందూ కమ్యూనిటీ పాత్ర విస్తృతమైనదని ఈ తీర్మానం వెల్లడించింది. యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటి రంగాల్లో వీరి పాత్ర వల్ల సాంస్కృతిక విలువలు పరిపుష్టమవుతున్నాయని తెలిపింది. వీటిని అమెరికన్ సమాజం విస్తృతంగా అవలంబిస్తోందని, లక్షలాది మంది తమ జీవితాలను పరిపుష్టం చేసుకుంటున్నారని వివరించింది.

అమెరికాలోని చాలా ప్రాంతాల్లో గత కొన్ని దశాబ్దాల్లో హిందూ-అమెరికన్లపై విద్వేషపూరిత నేరాలు చాలా జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయని తెలిపింది. హిందూ మతాన్ని నాశనం చేయాలని కోరుకునే కొందరు విద్యావంతులు హిందూ ఫోబియాను పెంచి పోషిస్తున్నారని, ఇది వ్యవస్థీకృతం అయిందని తెలిపింది. వీరు హిందూ మతానికి చెందిన పవిత్రమైన గ్రంథాలను, సాంస్కృతిక ఆచారాలను దూషిస్తూ, అవి హింస, అణచివేతలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారని పేర్కొంది.

హిందూఫోబియాకు వ్యతిరేకంగా తీర్మానం రావడానికి కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (CoHNA) అట్లాంటా చాప్టర్ నాయకత్వం వహించింది. మొట్టమొదటిసారి హిందూ అడ్వకసీ దినోత్సవాలను మార్చి 22న జార్జియా రాజధాని నగరంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన దాదాపు 25 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా హిందువుల ఆందోళనను అర్థం చేసుకుని, వారిని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమైన నిర్ణయాల్లో హిందువులను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు.

CoHNA వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ మాట్లాడుతూ, ఈ తీర్మానం ఆమోదం పొందే ప్రక్రియలో తమకు మార్గదర్శనం చేసిన రిప్రజెంటేటివ్ మెక్‌డొనాల్డ్, రిప్రజెంటేటివ్ జోన్స్, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు

IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..

Updated Date - 2023-04-01T19:31:38+05:30 IST