Share News

Jyoti Priya Mallick: వెస్ట్ బెంగాల్ మంత్రిని అదుపులోకి తీసుకున్నఈడీ.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-10-27T12:12:50+05:30 IST

పశ్చిమ బెంగాల్(West Bengal) మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్(Jyoti Priya Mallick)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. రూ.కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో(ration distribution scam) మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.

Jyoti Priya Mallick: వెస్ట్ బెంగాల్ మంత్రిని అదుపులోకి తీసుకున్నఈడీ.. ఎందుకంటే?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్(Jyoti Priya Mallick)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. రూ.కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో(ration distribution scam) మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేయాల్సిన బియ్యం, గోధుమలను బహిరంగ మార్కెట్‌లో అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్‌ను ఈడీ అక్టోబర్ 14న అరెస్టు చేసింది. మల్లిక్‌తో ఆ వ్యాపారవేత్తకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేస్తున్నప్పుడే రూ.కోట్ల విలువైన సరకులను పక్కదారి పట్టించారని ఈడీ ఆరోపిస్తోంది. మల్లిక్ దీనిపై స్పందిస్తూ.. బీజేపీ(BJP) తనపై కుట్ర చేస్తోందని.. ఎలాంటి తప్పు చేయని తనను జైలుకు పంపాలని చూస్తోందని అన్నారు. అయితే వివిధ కేసుల్లో టీఎంసీకి చెందిన పార్థ ఛటర్జీ, అనుబ్రత మోండల్, మాణిక్ భట్టాచార్యలను గతంలోనే అరెస్ట్ చేశారు. పలు స్కాంలలో కీలకంగా ఉన్నారని వీరిపై ఆరోపణలున్నాయి. టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ, ఆయన భార్యను కోల్ స్మగ్లింగ్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లలో ప్రశ్నించారు.


మండిపడ్డ దీదీ..

మంత్రి ప్రియా మల్లిక్ ని అదుపులోకి తీసుకోవడాన్ని సీఎం మమతా బెనర్జీ(Mamatha Banerjee) ఖండించారు. మల్లిక్ ఆరోగ్యం బాలేదని, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పినా... వినకుండా ఆయన్ని తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆయనకు ఏదైనా అయితే బీజేపీ, ఈడీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. గతంలోని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ ఆరోగ్యం బాలేదని తెలిసినా.. సీబీఐ అధికారులు సమన్లు పంపి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారని... దీంతో ఆయన గుండెపోటు వచ్చి మరణించారని దీదీ అన్నారు. అయితే ఈ కామెంట్లపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మమతా అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సువేందు అధికారి విమర్శించారు. దీదీకి ప్రశ్నించే ప్రతిపక్షం అక్కర్లేదని.. ఆమె టీఎంసీలోని దొంగలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుందని అన్నారు.

Updated Date - 2023-10-27T12:13:25+05:30 IST