Congress : రాహుల్ గాంధీకి మరోసారి నోటీసులిచ్చిన ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2023-03-19T14:18:27+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలు తనను భారత్

Congress : రాహుల్ గాంధీకి మరోసారి నోటీసులిచ్చిన ఢిల్లీ పోలీసులు
Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలు తనను భారత్ జోడో యాత్రలో కలిశారని ఆయన చెప్పిన నేపథ్యంలో, ఆ మహిళలకు న్యాయం చేస్తామని, వారి వివరాలు తమకు ఇవ్వాలని కోరారు.

రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, మన దేశంలో ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దీని గురించి మీడియా మాట్లాడటం లేదన్నారు. తన పాదయాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని చెప్పారు. తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని తెలిపారు.

ఈ మాటలను ఢిల్లీ పోలీసులు విచారణకు చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు) సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యామని చెప్పారు. సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా చాలా మంది తనతో మాట్లాడారని ఆయన చెప్పారన్నారు. బాధిత మహిళల సమాచారాన్ని అందజేయడానికి తనకు కాస్త సమయం కావాలని కోరారని చెప్పారు. త్వరలోనే సమాచారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ అంశంపై తాము తాజాగా ఇచ్చిన నోటీసును ఆయన కార్యాలయం స్వీకరించిందని చెప్పారు. ప్రశ్నించవలసి వస్తే ప్రశ్నిస్తామని చెప్పారు.

అంతకుముందు, దేశ రాజధాని నగరం ఢిల్లీలోని 12, తుగ్లక్ వీథిలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్ళారు. దీంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరడంపై మండిపడింది. అదానీ గ్రూప్ అవకతవకలపై తమ ప్రశ్నలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, అందుకే ఢిల్లీ పోలీసుల ద్వారా ఈ నాటకానికి తెర తీశారని ఆరోపించింది.

దేశంలో లక్షలాది మంది మహిళలు స్వేచ్ఛగా సంచరించేందుకు, తమ ఆవేదనను వినిపించడానికి, తమ బాధలను పంచుకోవడానికి భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ అవకాశం కల్పించినట్లు తెలిపింది. అదానీపై తాము సంధిస్తున్న ప్రశ్నలతో మోదీ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ఢిల్లీ పోలీసుల చౌకబారు నాటకాలే రుజువు చేస్తున్నాయని తెలిపింది. సమాధానాలను కోరే తమ దృఢ సంకల్పాన్ని ఈ వేధింపులు మరింత బలోపేతం చేస్తాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై మరో వేటుకు రంగం సిద్ధం?

Updated Date - 2023-03-19T14:18:27+05:30 IST