Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పురోగతి.. సిసోడియాపై అనేక సాక్ష్యాలు..

ABN , First Publish Date - 2023-05-19T13:08:58+05:30 IST

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పురోగతి.. సిసోడియాపై అనేక సాక్ష్యాలు..
Manish Sisodia, AAP

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) చెప్పింది. సంవత్సరానికి రూ.500 కోట్లు చొప్పున అక్రమంగా ఆర్జించే విధంగా ఈ కుంభకోణం జరిగినట్లు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కోర్టులో ఏప్రిల్ 25న దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటులో సీబీఐ తెలిపింది. మనీశ్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధాల్‌లపై ఈ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించడంపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. మే 27న తీర్పు చెప్పనున్నట్లు తెలిపింది.

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను కూడా సీబీఐ ప్రశ్నించింది. 2021లో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ప్రస్తుతం రద్దు చేశారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా, కేవలం ప్రైవేటు దుకాణాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు. అత్యధిక రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో మద్యం అమ్మకాలకు సంబంధం ఉంటుంది. నల్లబజారును నిలువరించడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వినియోగదారుల అనుభూతిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మద్యాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేయడానికి అనుమతించింది. మద్యం దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరచి ఉంచడానికి అనుమతించింది. మద్యం అమ్మకాలకు లైసెన్స్ పొందినవారు అపరిమితమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చునని తెలిపింది. ఈ విధానం అమలు వల్ల ఆదాయం 27 శాతం పెరుగుతుందని, రూ.8,900 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

ఇదిలావుండగా, ఈ విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు జరిపింది. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీనిని పరిశీలించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ కుంభకోణంలో మనీలాండరింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరుపుతోంది. అరెస్టయిన వ్యాపారి ద్వారా రూ.100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి ‘సౌత్ గ్రూప్’ అనే లిక్కర్ లాబీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ సొమ్మును గోవా ఎన్నికల కోసం ఆ పార్టీకి ఇచ్చినట్లు తెలిపింది. ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ కే కవితను కూడా ఈడీ ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి :

UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?

Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

Updated Date - 2023-05-19T13:08:58+05:30 IST