Share News

Parliament Security Breach: ఆ బీజేపీ ఎంపీని ఎందుకు ప్రశ్నించట్లేదు.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

ABN , Publish Date - Dec 20 , 2023 | 10:22 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోరినందున ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు కానీ..

Parliament Security Breach: ఆ బీజేపీ ఎంపీని ఎందుకు ప్రశ్నించట్లేదు.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

Parliament Security Breach: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోరినందున ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు కానీ.. లోక్‌సభలో అలజడి సృష్టించిన దుండగులకు పాస్‌ ఇచ్చిన బీజేపీ ఎంపీని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసింది. అతనితో పాటు మతపరమైన, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించిన బీజేపీ ఎంపీ రమేష్ బిధురిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది.

‘‘పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన జరిగిన సరిగ్గా వారం రోజులు అవుతోంది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైందని ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. సరే.. ఆ సంగతి పక్కన పెడదాం. లోక్‌సభలో గందరగోళం సృష్టించిన ఆ దుండగులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను ఏడురోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు. మరోపక్క డిసెంబర్ 13 ఘటనపై హోంమంత్రి ప్రకటన కోసం చట్టబద్ధ డిమాండ్ చేసిన 140 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేశారు’’ అని జైరాం రమేశ్‌ ట్వీట్ చేశారు. పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేని మిమిక్రీ ఇష్యూని మోదీ వ్యవస్థ ఏదో భారీ తప్పు జరిగినట్టు రచ్చ చేస్తోందని.. కానీ ఒక బీజేపీ ఎంపీ డిసెంబర్ 13న లోక్‌సభలోకి ఇద్దరు చొరబాటుదారుల ప్రవేశాన్ని ఎలా సులభతరం చేశారన్న అసలు విషయంపై మాత్రం మౌనంగా ఉందని విమర్శించారు.


అటు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎక్స్ వేదికగా ఈ వ్యవహారంపై భగ్గుమన్నారు. ‘‘చొరబాటుదారుల ప్రవేశాన్ని సులభతరం చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఏమో స్కాట్-ఫ్రీగా మిగిలిపోయాడు. అతడ్ని ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. ఇది ఎలాంటి విచారణ? పార్లమెంటరీ భద్రతకు బాధ్యత వహించే సీనియర్ అధికారులను ఎందుకు జవాబుదారీగా చేయలేదు?’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. డిసెంబర్ 13 చొరబాట్లను చేయడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ‘‘ఈ భద్రతా లోపానికి కారణమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను శిక్షించే బదులు.. ప్రతిపక్ష ఎంపీల ప్రజాస్వామ్య హక్కులను వాళ్లు లాక్కున్నారు. తద్వారా జవాబుదారీతనం నుండి తప్పించుకున్నారు’’ అని ఖర్గే మండిపడ్డారు. ప్రశ్నించే వారేమో బయట, యాసల్ని ఉపయోగించేవారేమో లోపలున్నారని డానిష్ అలీ కూడా ఎద్దేవా చేశారు.

చొరబాటుదారులకు లోక్‌సభ విజిటర్ పాస్‌లు ఇప్పించిన ప్రతాప్ సింహాపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని డానిష్ అలీ ప్రశ్నించారు. ‘‘ప్రశ్నించే వారికి శిలువ వేయాలని ప్రభుత్వం తీరు ఉందని, తాను సెషన్‌లో లేకపోయినా సస్పెన్షన్ జాబితాలో తన పేరుని చేర్చారని ఆయనన్నారు. మరో ఎంపీ సౌగతా రే మాట్లాడుతూ.. ఎంపీల సామూహిక సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. తాము బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని.. కానీ అందుకు బదులుగా వాళ్లు మమ్మల్నే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 20 , 2023 | 10:22 PM