BJP Vs Congress : ముషారఫ్‌పై శశి థరూర్ ప్రశంసలు... బీజేపీ ఆగ్రహం...

ABN , First Publish Date - 2023-02-05T16:15:36+05:30 IST

పాకిస్థాన్ (Pakistan) మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf)ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌

BJP Vs Congress : ముషారఫ్‌పై శశి థరూర్ ప్రశంసలు... బీజేపీ ఆగ్రహం...
Pervez Musharraf, Rahul Gandhi

న్యూఢిల్లీ : పాకిస్థాన్ (Pakistan) మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf)ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor)పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్‌ కార్గిల్ యుద్ధానికి కారకుడయ్యారని, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను కొనియాడారని గుర్తు చేసింది. ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ముషారఫ్ మృతిపై శశి థరూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అరుదైన వ్యాధితో మరణించారని తెలిపారు. ఆయన ఒకప్పుడు భారత దేశానికి రాజీలేని శత్రువు అని తెలిపారు. అయితే 2002-2007 మధ్య కాలంలో నిజమైన శాంతికాముకుడిగా మారారని చెప్పారు. ఆ రోజుల్లో తాను ఐక్య రాజ్య సమితిలో ఆయనను ప్రతి సంవత్సరం కలిసేవాడినని చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, కలుపుగోలుగా ఉంటారని, వ్యూహాత్మక ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్‌ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు ముషారఫ్‌ను ప్రశంసిస్తోందని దుయ్యబట్టారు. ముషారఫ్ గతంలో రాహుల్ గాంధీని జెంటిల్మన్ అని పొగిడారని గుర్తు చేశారు.

ఒసామా బిన్ లాడెన్‌ (Osama Bin Laden)ను, తాలిబన్‌ (Taliban)ను పొగిడిన ముషారఫ్ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కూడా ప్రశంసించారని, జెంటిల్మన్ అని పొగిడారని, ఆయనకు మద్దతు పలికారని పేర్కొన్నారు. కార్గిల్ (Kargil) యుద్ధానికి కారకుడైన, ఉగ్రవాదాన్ని బలపరచిన ముషారఫ్‌ను శశి థరూర్ పొగడటానికి కారణం బహుశా ఇదే అయి ఉంటుందని చెప్పారు.

పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి కారకుడని, నియంత అని, అమానుష నేరాల్లో నిందితుడని తెలిపారు. తాలిబన్లను, అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను సోదరులు, హీరోలు అని అభివర్ణించారని తెలిపారు. ఆయన తన సొంత సైనికుల మృతదేహాలను తీసుకెళ్ళడానికి సైతం తిరస్కరించారన్నారు. అలాంటి వ్యక్తిని శశి థరూర్ పొగడటం ఆశ్చర్యంగా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పాకిస్థాన్‌ మీద ఉన్న భక్తి భావం శశి థరూర్ ట్వీట్‌ ద్వారా వ్యక్తమవుతోందన్నారు.

రాహుల్ గాంధీపై ముషారఫ్ అభిప్రాయం

ముషారఫ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీని భారత దేశానికి ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. నరేంద్ర మోదీ శాంతికి తగిన వ్యక్తి కాదన్నారు.

అరుదైన వ్యాధితో...

ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆయన ఈ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు.

జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు.

Updated Date - 2023-02-05T16:15:41+05:30 IST