The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై మండిపడిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-05-09T20:03:05+05:30 IST

కేరళ స్టోరీ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.

The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై మండిపడిన కాంగ్రెస్
Congress angry on Yogi Adityanath

న్యూఢిల్లీ: కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో రూపొందించిన కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. దిగజారిన రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది.

అంతకుముందు యూపీలో కేరళ స్టోరీ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ఇప్పటికే కేరళ స్టోరీ సినిమాను నిషేధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. మమత కేరళ స్టోరీ సినిమాను చూడకుండానే నిషేధించడం దురదృష్టకరమని సినిమా దర్శకుడు సుదీప్తోసేన్ వ్యాఖ్యానించారు.

మమత నిర్ణయాన్ని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Indian Motion Pictures Producers Association) తప్పుబట్టింది. భావప్రకటనా స్వేచ్ఛకు (freedom of expression) ఆటంకమని అభిప్రాయపడింది.

మమత నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా (Vipul Amrutlal Shah) తెలిపారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని ఆయన చెప్పారు. అదే సమయంలో తమిళనాడులో(Tamil Nadu) సినిమాను బ్యాన్ చేయాంటూ ఎన్‌టీకే(NTK) పార్టీ అధినేత సీమన్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ సినిమాను అడ్డుకోవడాన్ని విపుల్ షా తప్పుబట్టారు. ఒక్క వ్యక్తి బెదిరిస్తే సినిమా ప్రదర్శనను ఆపివేస్తారా అని తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా సినిమాను నిషేధించలేదని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు కూడా కేరళ స్టోరీ సినిమాను నిషేధించింది.

మరోవైపు కేరళ స్టోరీ సినిమాను కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వరుసబెట్టి కుటుంబ సమేతంగా చూస్తున్నారు. విద్యార్ధులను, యువతను సినిమా చూడాలని ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా జేపీ నడ్డా బెంగళూరులో విద్యార్థులతో కలిసి సినిమా చూశారు.

మరో వైపు ది కేరళ స్టోరీ సినిమా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ (taran adarsh) ట్వీట్ చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 35 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు ఇప్పటికే వచ్చాయన్నారు. అదా శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-05-09T20:08:08+05:30 IST