Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

ABN , First Publish Date - 2023-08-08T16:49:26+05:30 IST

భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభ (Rajya Sabha)లో ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services Bill)పై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ (Congress) ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ (BJP) విమర్శించింది.


కాంగ్రెస్ విప్‌ను అనుగుణంగా మన్మోహన్ సింగ్ పార్లమెంటుకు వీల్‌చైర్‌పై వచ్చారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు అనంతరం బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినట్టుగా ప్రకటించారు.


మన్మోహన్ చిత్తశుద్ధికి నిదర్శనం

మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభకు హాజరైనందుకు 'ఆప్' ఎంపీ రాఘవ్ చద్దా కృతజ్ఞతలు తెలిపారు. ''ఈరోజు, రాజ్యసభలో చిత్తశుద్ధికి నిదర్శనంగా మన్మోహన్ నిలిచారు. నల్ల ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సూర్ఫి పట్ల చెక్కుచెదరని విశ్వాసం కనబరచారు. ఆయన అందిస్తున్న విలువైన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్యూ సార్..'' అని చద్దా అన్నారు.


బీజేపీ కౌంటర్..

మన్మోహన్‌కు ఆరోగ్యం సరిగా లేకపోయినా వీల్‌చైర్‌పై ఆయనను రప్పించడం సిగ్గుచేటని బీజేపీ విమర్శలు గుప్పించింది. ''కాంగ్రెస్ పిచ్చితనం దేశం గుర్తుంచుకుంటుంది. తమ అపవిత్ర కూటమిని సజీవంగా నిలిపేందుకు ఆరోగ్యం సరిగా లేకపోయినా మాజీ ప్రధానిని వీల్‌చైర్‌పై అర్ధారాత్రి పొద్దుపోయేంత వరకూ పార్లమెంటులో ఉంచడం సిగ్గుచేటు'' అని బీజేపీ తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే వెంటనే ప్రతిస్పందించారు. రాజ్యసభకు మన్మోహన్ సింగ్ హాజరుకావడం ద్వారా ప్రజాస్వామ్యంపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుందని అన్నారు.


కేజ్రీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

రాజ్యసభలో ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా విపక్ష పార్టీ నేతల మద్దతు సమీకరిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 101 ఓట్లు రావడంతో బిల్లు నెగ్గింది. దీనికి ముందు ఆగస్టు 3న విపక్షాల ఆందోళనలు, అభ్యంతరాల మధ్య లోక్‌సభలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.

Updated Date - 2023-08-08T16:49:26+05:30 IST