New Parliament : శ్రేష్ఠత దిశగా ప్రయాణానికి నాంది : అమిత్ షా

ABN , First Publish Date - 2023-05-28T17:42:32+05:30 IST

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.

New Parliament : శ్రేష్ఠత దిశగా ప్రయాణానికి నాంది : అమిత్ షా

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అభినందించారు. అమృతకాలంలో అన్ని రంగాల్లోనూ శ్రేష్ఠత దిశగా దేశం ప్రారంభించిన ప్రయాణానికి ఇది నాంది అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు. వేద మంత్రాలు, ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

అమిత్ షా ఆదివారం #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌తో ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి నూతన పార్లమెంటు భవనాన్ని అంకితం చేశారని చెప్పారు. ఈ భవనం కేవలం ప్రజల ఆకాంక్షలు మొగ్గ తొడిగి, వికసించి, ఫలాలుగా మారే చోటు మాత్రమే కాదని, అమృత కాలంలో అన్ని రంగాల్లోనూ శ్రేష్ఠత దిశగా భారత దేశ ప్రస్థానానికి నాంది అని తెలిపారు.

నూతన పార్లమెంటులో మోదీ ప్రతిష్ఠించిన ధర్మదండం (సెంగోల్) భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వర్తమానంతో అనుసంధానం చేస్తుందని చెప్పారు. మన సుసంపన్న సంస్కృతిలో ధర్మం గొప్పతనాన్ని భావి తరాలకు గుర్తు చేస్తుందన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని రికార్డు సమయంలో నిర్మించిన శ్రమ యోగులు (కార్మికులు)ను ప్రశంసించారు. శ్రమ జీవులను ప్రధాని మోదీ సత్కరించిన సంగతి తెలిసిందే.

చిరస్థాయిగా నిలిచే రోజు మే 28 : మోదీ

నూతన పార్లమెంటులో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడుతూ, ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ కొన్ని ఘట్టాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. మే 28 కూడా అటువంటి రోజు అని చెప్పారు. దీనికి అమరత్వం వచ్చిందన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలనలో మన ఆత్మాభిమానం దొంగిలించబడిందన్నారు. నేడు ఆ వలసవాద భావజాలాన్ని మన దేశం వదిలిపెట్టిందని చెప్పారు. లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద ప్రతిష్ఠించిన ధర్మదండం (సెంగోల్) గురించి మాట్లాడుతూ, చోళ సామ్రాజ్యంలో దీనిని కర్తవ్యం, సేవ, దేశ భక్తిలకు ప్రతీకగా పరిగణించేవారన్నారు. భారత దేశ ప్రజాస్వామ్యమే భారత దేశానికి ప్రేరణ అని, రాజ్యాంగమే దృఢ సంకల్ప పత్రమని, ఈ ప్రేరణ, సంకల్పాలకు అత్యుత్తమ ప్రతినిధి పార్లమెంటు అని తెలిపారు. నూతన పార్లమెంటు పాత, కొత్తల మేలు కలయిక అని చెప్పారు. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు, ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించడానికి మోదీ వస్తున్నపుడు, సభ్యులంతా లేచి నిల్చుని, కరతాళ ధ్వనులతో ఆయనకు స్వాగతం పలికారు.

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) ఇచ్చిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు.

ఇవి కూడా చదవండి :

New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..

New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ

Updated Date - 2023-05-28T17:42:32+05:30 IST