ప్రధాని పర్యటనకు ముందే... బీజేపీకి షాక్‌

ABN , First Publish Date - 2023-03-03T11:33:18+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ పాలన మరోసారి తీసుకువచ్చేందుకు పార్టీ ఢిల్లీ నేతలు తీవ్ర కసరత్తు సాగిస్తున్నారు. పార్టీకి పలుకుబడి లేని మైసూరు ప్రాంతంలో బీజేపీ

ప్రధాని పర్యటనకు ముందే... బీజేపీకి షాక్‌

- కాంగ్రెస్‏లో చేరేందుకు సిద్ధమైన మంత్రి నారాయణగౌడ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ పాలన మరోసారి తీసుకువచ్చేందుకు పార్టీ ఢిల్లీ నేతలు తీవ్ర కసరత్తు సాగిస్తున్నారు. పార్టీకి పలుకుబడి లేని మైసూరు ప్రాంతంలో బీజేపీ సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah)లు మైసూరు జిల్లాలో తరచూ పర్యటనలు సాగిస్తున్నారు. మరో పది రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి మండ్య జిల్లా పర్యటన ఉంది. సుమారు 40 కిలోమీటర్‌ల మేర రోడ్‌షో ద్వారా ఈప్రాంత ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్దమయ్యారు. కానీ అంతలోనే బీజేపీకి భారీ షాక్‌ తప్పదనిపిస్తోంది. జిల్లాకు చెందిన క్రీడలు, యువజనుల శాఖా మంత్రి నారాయణగౌడ బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారు. మండ్య జిల్లా కేఆర్‌ పేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌(Congress) పార్టీ నుంచి ఆహ్వానం రావడం వాస్తవమే అన్నారు. పార్టీలో చేరే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆప్తులు, సన్నిహితులతో చర్చలు జరిపాక తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కేఆర్‌ పేటలో కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం కొరత ఉందనేది తెలిసిందే. అందుకే పార్టీలోకి నారాయణ గౌడ(Narayana Gowda)ను తీసుకువచ్చేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పాటు జేడీఎస్‏లో కొనసాగిన నారాయణగౌడ 2018లో అదే పార్టీ నుంచి కేఆర్‌పేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో సంకీర్ణ ప్రభుత్వం కూలేందుకు కారకులైన 17మందిలో నారాయణగౌడ కూడా ఒకరు. జేడీఎస్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు.

Updated Date - 2023-03-03T11:33:18+05:30 IST