Modi Nobel prize: నోబెల్ ప్రైజ్‌కి మోదీ పోటీ?.. ఈ వార్తల్లో అసలు నిజం బయటపడింది..

ABN , First Publish Date - 2023-03-16T20:36:00+05:30 IST

ప్రధాని మోదీ (Narendra modi) ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీకి చేరిందని, ఈసారి శాంతి బహుమతికి (Nobel Peace Prize 2023) ఆయనే ప్రధాన పోటీదారుడంటూ గురువారం పలు జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ ...

Modi Nobel prize: నోబెల్ ప్రైజ్‌కి మోదీ పోటీ?.. ఈ వార్తల్లో అసలు నిజం బయటపడింది..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీకి చేరిందని, ఈసారి శాంతి బహుమతికి (Nobel Peace Prize 2023) ఆయనే ప్రధాన పోటీదారుడంటూ గురువారం పలు జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి. భారత్‌లో పర్యటిస్తున్న నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే (Asle Toje) స్వయంగా ఈ విషయాన్ని చెప్పారంటూ వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రధాన న్యూస్‌ఔట్స్ సహా సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఈ న్యూస్ ఫేక్ అని తేలిపోయింది.

‘నోబెల్ అవార్డ్‌కు ప్రధాని మోదీ ప్రధాన పోటీదారు’ అనే ప్రచారంపై నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ‘‘ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ నేను. ఒక ఫేక్ న్యూస్ ట్వీట్‌ను వదిలారు. మనం దానిని ఫేక్‌న్యూస్‌‌గానే పరిగణించాలి. మనం దీని గురించి మాట్లాడొద్దు. మాట్లాడి ఆ న్యూస్‌‌కు ఆజ్యం పోయొద్దు. ట్వీట్‌లోని అంశాలను కేటగిరివారీగా ఖండిస్తున్నాను’’ అన్నారు. అస్లే టోజే స్పష్టత ఇస్తున్న వీడియోను ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ (Mohammad Zubair) ట్వీట్ చేశాడు. ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేయలేదంటూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఒక ప్రశ్న సంధించాడు. దీంతో నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ ప్రధాన పోటీదారనే వార్తలకు కళ్లెం పడినట్టు అయ్యింది. కాగా ఈ విధంగా ఫేక్ ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధాన మీడియా సంస్థలు సైతం ఈ విధంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సరికాదని సూచిస్తున్నారు.

భారత్‌లో పర్యటిస్తున్న అస్లే టోజే..

నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే (Asle Toje) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేర్వేరు మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా బుధవారం ఓ మీడియా సంస్థ మాట్లాడుతూ... ప్రధానమంత్రి మోదీ పనితీరును ప్రశంసించారు. అణ్వాయుధాలు వాడితే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో రష్యాకు భారత్ గుర్తుచేయడం చాలా దోహదపడిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ పెద్దగా స్వరం పెంచి మాట్లాడదని, ఎవరినీ హెచ్చరించదని, స్నేహపూర్వకరంగా వ్యవహరిస్తూనే తన స్థానం ఏంటో తెలియజేస్తుందని ప్రశంసించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి మరిన్ని అవసరమని టోజే వ్యాఖ్యానించారు. కాగా అస్లే టోజే విద్యావేత్త, రచయిత. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లండ్, అమెరికాలలో పని చేశారు. ఓస్లో, ట్రామ్సే విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

Updated Date - 2023-03-16T20:41:39+05:30 IST