Arvind Kejriwal: మామ మోసం చేశాడని విరుచుకుపడుతూ.. హామీల వర్షం కురిపించిన కేజ్రీవాల్
ABN , First Publish Date - 2023-08-20T21:48:31+05:30 IST
మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఎన్నికల శంఖారావం పూరించాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధం..
మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఎన్నికల శంఖారావం పూరించాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధం జరుగుతోంది. అలాగే.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో తామూ ఏం తక్కువ తినలేదన్నట్టుగా.. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. స్వయంగా ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగి.. తనదైన రాజకీయాలకు తెరలేపారు. బీజేపీతో పాటు తమ ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ‘మామ’గా అభివర్ణించారు. మధ్యప్రదేశ్‌లో ఒక మామ ఉన్నారని, ఆయన తన మేనల్లుళతో పాటు మేనకోడళ్లను మోసం చేశాడని.. ఆయన్ను నమ్మొద్దని అన్నారు. ఇదే సమయంలో తనని తాను చాచాగా సంబోధించుకున్న కేజ్రీవాల్.. ఇప్పుడు మీ చాచా వచ్చారని, మీ మామని నమ్ముకోకుండా చాచాపై నమ్మకం ఉంచాలని కోరారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమను మరో 50 ఏళ్ల వరకూ ఎవరూ కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో కూడా తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. కాంగ్రెస్, బీజేపీలను మర్చిపోయేలా గొప్ప పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు.
బీజేపై కాంగ్రెస్, కాంగ్రెస్‌పై బీజేపీ.. ఇలా ఆ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటాయని.. కానీ తమకు విమర్శించడం రాదని అన్నారు. జాతిని నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తాము రాజకీయ నాయకులం కాదని, జాతిని నిర్మించడమే తమ ప్రధాన ఎజెండా అని తెలిపారు. ఇన్‌కమ్ టాక్స్ కమీషనర్‌గా పని చేసిన తాను.. జాతిని నిర్మించాలన్న ఉద్దేశంతోనే ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మధ్యప్రదేశ్‌లో చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వం ఉందని, ఈ సమయంలో రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. పంజాబ్, ఢిల్లీని అవినీతి రహితంగా మార్చినట్లే, మధ్యప్రదేశ్‌ను కూడా మార్చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి బాలుడు, బాలికకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ అన్నారు. ఉద్యోగ నియామకాల్లో సిఫార్సులు, అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రభుత్వ బడులను బాగుచేస్తామని, ప్రైవేటు బడుల్లో అక్రమంగా ఫీజులు పెంచకుండా కట్టడి చేస్తామని చెప్పిన కేజ్రీవాల్.. నగరాలతో పాటు గ్రామాల్లోనూ 24 గంటల విద్యుత్ అందేలా చేస్తామని మాటిచ్చారు.