Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ ఎంతకు తెగించాడంటే...

ABN , First Publish Date - 2023-03-24T20:14:47+05:30 IST

ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ ఎంతకు తెగించాడంటే...
Amrit Pal Singh, Punjab

న్యూఢిల్లీ : ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) వారం రోజుల నుంచి పంజాబ్ పోలీసుల కంటికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన లీలలు చాలా ఉన్నాయని పోలీసులు చెప్పారు. తనకంటూ ఓ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేకంగా కరెన్సీని రూపొందించుకున్నారని చెప్పారు. ఖలిస్థాన్ దేశం కోసం జెండాను కూడా రూపొందించారని తెలిపారు.

ఖన్నా పోలీస్ ఎస్ఎస్‌పీ అమ్నీత్ కౌండల్ ఓ టీవీ చానల్‌తో శుక్రవారం మాట్లాడుతూ, అమృత్‌పాల్ సింగ్ తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమృత్‌పాల్ టైగర్ ఫోర్స్ పేరుతో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆనంద్‌పూర్ ఖల్సా ఫౌజ్ తరహాలో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆయన ప్రత్యేకంగా ఖలిస్థాన్ కరెన్సీని కూడా రూపొందించి, ముద్రించారన్నారు. దీని కోసం ఆయన ఓ ఉద్యమాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. డాలర్ నుంచి కాపీ చేసి ఈ కరెన్సీని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఖలిస్థాన్ మ్యాప్‌ను కూడా ముద్రించినట్లు చెప్పారు. కపుర్తల, పాటియాలా, జింద్ ప్రాంతాలను కలిపి ఖలిస్థాన్‌ దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఓ జెండాను కూడా రూపొందించాడన్నారు.

ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (AKF), అమృత్‌పాల్ టైగర్ ఫోర్స్ సభ్యులకు AKF నంబర్లు ఇచ్చారని, సైన్యంలో సైనికులకు నంబర్లు ఇచ్చినట్లుగానే ఇవి ఉన్నాయని తెలిపారు. వీరి చేతులపై AKF పచ్చబొట్లు కూడా ఉన్నాయన్నారు. అమృత్‌పాల్ టైగర్ ఫోర్స్‌లో కేవలం యువతను మాత్రమే నియమించుకుంటున్నారన్నారు. అమృత్‌పాల్ సన్నిహితుడు తేజిందర్ వురపు గోర్ఖా బాబా ఫోన్ నుంచి దీనికి సంబందించిన సాక్ష్యాధారాలను రాబట్టినట్లు తెలిపారు. ఖలిస్థాన్ ఏర్పాటు కోసం అమృత్‌పాల్ సింగ్ చాలా దేశాలతో సంబంధాలు నెరపుతున్నారని, పాకిస్థాన్ ఐఎస్ఐ ఆయనకు సహాయపడుతోందని చెప్పారు.

అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు చర్యలు శుక్రవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఆయన నేపాల్ వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో నేపాల్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయనకు, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో గురువారం ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..

World TB Summit : క్షయ వ్యాధిపై సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-03-24T20:14:47+05:30 IST