CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-24T12:46:02+05:30 IST

2022 మార్చి 31వ తేదీతో ముగిసిన సంవత్సరానికి ఏపీ ఆర్ధిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ కార్యాలయం సమర్పించింది.

CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..

అమరావతి : 2022 మార్చి 31వ తేదీతో ముగిసిన సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ (AP) ఆర్ధిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (CAG) కార్యాలయం సమర్పించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 90 శాతం మేర రుణాలు.. 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవే కావడం గమనార్హం. 2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది, బడ్జేటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం 92,797గా నమోదైంది. వచ్చే ఏడేళ్లలోగా రాష్ట్ర ప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన 6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 24,257 కోట్ల రూపాయల మేర పెరిగాయి. బడ్జేటేతర రుణాలు 1,18,394 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. డిస్కమ్‌లకు, నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 17,804 కోట్లుగా ఉంది. వీటిని బడ్జెట్‌లో చూపక పోవటంతో కీలకమైన మౌలిక సదుపాయల కల్పనా నిధులపై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 2021లో ఏపీ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది. తద్వారా ఆర్ధిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగిందని కాగ్ రిపోర్ట్ పేర్కొంది.

రూ.688 కోట్లు రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్దిదారులకు ఇచ్చే ఇళ్లస్థలాలు ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్‌లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగ్గా అమలు కాలేదు. 3540 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేపిటల్ వ్యయం తక్కువగా ఉంది. ఇది భౌతిక ఆస్తుల కల్పనపై ప్రభావాన్ని చూపి దీర్ఘకాల అార్ధికాభివృద్ధి కుంటుపడే అవకాశముందని కాగ్ తన నివేదికలో తెలిపింది.

Updated Date - 2023-03-24T13:08:03+05:30 IST