Amrit Bharat Station scheme : రైలు ప్రయాణాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-06T14:12:18+05:30 IST

భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం అమృత కాలం ప్రారంభంలో ఉందని చెప్పారు. నూతన శక్తి, నూతన ప్రేరణ, నూతన సంకల్పాలు ఉన్నాయని తెలిపారు.

Amrit Bharat Station scheme : రైలు ప్రయాణాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
Narendra Modi

న్యూఢిల్లీ : భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం అమృత కాలం ప్రారంభంలో ఉందని చెప్పారు. నూతన శక్తి, నూతన ప్రేరణ, నూతన సంకల్పాలు ఉన్నాయని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ క్రింద దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రపంచం భారత దేశంవైపు రెండు కారణాల వల్ల చూస్తోందని చెప్పారు. అందులో మొదటిది, 30 ఏళ్ళ తర్వాత ప్రజలు పరిపూర్ణ ఆధిక్యతతో ఓ పార్టీని ఎన్నుకోవడమని, రెండోది, సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుండటమని తెలిపారు. ఆధునిక రైల్వే స్టేషన్ల వల్ల పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. ‘‘ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి’’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, దీనివల్ల కార్మికులు, వృత్తిపనివారు, నిపుణులకు మేలు జరుగుతుందని చెప్పారు. వీటన్నిటితోపాటు ఆయా జిల్లాలకు ప్రత్యేక కీర్తి, ముద్ర వస్తాయని తెలిపారు.

రైలు ప్రయాణం అందుబాటులో ఉండటం మాత్రమే కాకుండా, అది ఆనందదాయకంగా, సంతోషంగా జరిగేలా చేయాలన్నదే లక్ష్యమని చెప్పారు. ప్రతి అమృత్ స్టేషన్ ఆ నగర ఆకాంక్షలకు, భారత దేశ ప్రాచీన వారసత్వ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందని చెప్పారు. నకారాత్మక (Negative) రాజకీయాలకు అతీతంగా, తాము సకారాత్మక (Positive) రాజకీయాలు చేస్తున్నామని, అభివృద్ధికే పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. భారత దేశ వారసత్వ ఘనతను అమృత్ స్టేషన్లు చాటుతాయన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు మరింత పెరుగుతాయని చెప్పారు.


‘క్విట్ ఇండియా’

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడిన పార్టీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, అవినీతి, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపుల రాజకీయాలు భారత దేశం నుంచి వెళ్లిపోవాలని యావత్తు దేశం చెప్తోందన్నారు. బ్రిటిషర్లను దేశం నుంచి వెళ్లగొట్టిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమమే దీనికి స్ఫూర్తి అని తెలిపారు. ప్రతిపక్షాలు ఏకైక సూత్రాన్ని పాటిస్తున్నాయని, ‘‘వారు పని చేయరు, ఇతరులను పని చేయనివ్వరు’’ అని తెలిపారు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను దాదాపు రూ.24,470 కోట్ల వ్యయంతో పునరభివృద్ధి చేస్తారు. అత్యంత శక్తిమంతమైన సిటీ సెంటర్లుగా వీటిని తీర్చిదిద్దుతారు. ఈ స్టేషన్ల పరిసరాల్లోని పట్టణాలతో సమగ్రంగా అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రధాన దృష్టి పెడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఈ పథకం అమలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్టేషన్ల డిజైన్ విషయంలో మోదీ అద్భుతమైన సలహాలు ఇచ్చారన్నారు.

స్థానిక సంస్కృతి ప్రతిబింబించే విధంగా..

ఈ పథకం క్రింద ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 55 చొప్పున, బిహార్లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, ఆంధ్ర ప్రదేశ్‌లో 18, తెలంగాణలో 21, మధ్య ప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్‌లో 21, జార్ఖండ్‌లో 20, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను పునరభివృద్ధి (Redevelopment) చేయబోతున్నారు. స్టేషన్ భవనాలను స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, వాస్తు శిల్పం వంటివాటికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈ పథకం క్రింద దేశవ్యాప్తంగా 1,309 స్టేషన్లను పునరభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి :

Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

Hyderabad Student : అమెరికాలో ఆకలితో బాధపడుతున్న హైదరాబాద్ విద్యార్థినికి ఇండియన్ కాన్సులేట్ అండదండలు

Updated Date - 2023-08-06T14:12:18+05:30 IST