Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

ABN , First Publish Date - 2023-08-06T09:08:33+05:30 IST

తైవాన్‌ (Taiwan)పై దాడికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడటానికి సిద్ధమేనని సైనికులు శపథాలు చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ప్రసారం చేసింది. ఎనిమిది ఎపిసోడ్ల డాక్యుమెంటరీలో సైనికుల శపథాలను చూపించారు.

Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

బీజింగ్ : తైవాన్‌ (Taiwan)పై దాడికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడటానికి సిద్ధమేనని సైనికులు శపథాలు చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ప్రసారం చేసింది. ‘ఝు మెంగ్’ (కలల వెంట పరుగు) పేరుతో ఎనిమిది ఎపిసోడ్ల డాక్యుమెంటరీలో భాగంగా చైనా సైనికుల శపథాలను చూపించారు. తాము ఆత్మబలిదానానికి సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఇది పీఎల్ఏ 96వ వార్షికోత్సవాలకు సంబంధించిన డాక్యుమెంటరీ. ఏ క్షణంలోనైనా యుద్ధానికి సిద్ధమని తైవాన్‌కు సంకేతాలు పంపడానికే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేశారని భావిస్తున్నారు.

చైనా పత్రిక ‘సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్’ వెల్లడించిన వివరాల ప్రకారం, స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానంలోని పైలట్ చేసిన శపథాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ పైలట్ వాంగ్ హాయ్ స్క్వాడ్రన్‌కు చెందిన జే-20 పైలట్ లీ పెంగ్. ‘‘నిజమైన యుద్ధంలో శత్రువుపైకి దూసుకెళ్లేటపుడు, నేను నా దగ్గర ఉన్న అన్ని ఆయుధాలను పూర్తిగా వినియోగిస్తే, నా యుద్ధ విమానమే నా చిట్ట చివరి క్షిపణి అవుతుంది’’ అని లీ చెప్తున్నట్లు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తోంది.


పీఎల్ఏ నావికా దళానికి చెందిన మైన్‌స్వీపర్ యూనిట్‌లో ఫ్రాగ్‌మన్ జువో ఫెంగ్ ఈ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ, యుద్ధం వచ్చినట్లయితే, నిజమైన యుద్ధంలో నావల్ మైన్స్‌ను సురక్షితంగా తొలగించడం చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో మా ల్యాండింగ్ ఫోర్సెస్ కోసం సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మేము మా శరీరాలను ఉపయోగిస్తామని శపథం చేశారు.

ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో పీఎల్ఏ సైనికుల వ్యక్తిగత కథనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తైవాన్ పరిసరాల్లో సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. పీఎల్ఏ శతాబ్ది లక్ష్యం నెరవేరాల్సిందేనని ఈ డాక్యుమెంటరీ చెప్తోంది.

‘విడిపోయినదానిని కలుపుకుంటాం’

స్వయంపాలిత తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అని, దానిని తిరిగి సొంతం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికి వెనుకాడేది లేదని చైనా చెప్తోంది. తైవాన్ స్వతంత్ర దేశమనే విషయాన్ని అమెరికా సహా చాలా దేశాలు అంగీకరించడం లేదు. అయితే బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చాలనే ఆలోచనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

Kharge, Rahul: మన ఓటు శాతం ఎందుకు తగ్గిందో చెప్పండి..?

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. మీరు చేసేది ఇదేనా.. కపట నాటకాలు వద్దు

Updated Date - 2023-08-06T10:08:09+05:30 IST