America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-28T10:22:20+05:30 IST

అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, భారతీయ న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీ

America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
Vedant Patel, America

వాషింగ్టన్ : ఏ ప్రజాస్వామ్యానికైనా చట్టాన్ని గౌరవించడం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మూల స్తంభం వంటివని అమెరికా తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ఓ పరువు నష్టం కేసులో దోషిగా నిర్థరణ అయి, ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడైన విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను నేరంగానిర్థరిస్తూ, గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, భారతీయ న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీ కేసును తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాక్ స్వాతంత్ర్యం సహా ప్రజాస్వామిక విలువల కోసం ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని, భారత ప్రభుత్వంతో ఈ విషయంలో సంప్రదిస్తున్నామని తెలిపారు. భారత దేశంతో జరిపే సంప్రదింపులలో వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక సిద్ధాంతాలు, మానవ హక్కుల పరిరక్షణల ప్రాధాన్యం గురించి నిరంతరం లేవనెత్తుతామని తెలిపారు. ఇవి ఇరు దేశాల ప్రజాస్వామ్యాల బలోపేతానికి చాలా కీలకమైనవని చెప్పారు.

భారత దేశంతో కానీ, రాహుల్ గాంధీతో కానీ ప్రత్యేకంగా మాట్లాడారా? అని అడిగినపుడు వేదాంత్ పటేల్ మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. ద్వైపాక్షిక సంబంధాలుగల దేశాల్లోని ప్రతిపక్ష నాయకులతో మాట్లాడటం సాధారణ విషయమేనని చెప్పారు.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ అనే గుజరాత్ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పార్లమెంటు సచివాలయం ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 2019లో గెలిచిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

Food Items Eating Time: తినే సమయమే చాలా ముఖ్యం.. అరటిపండ్ల నుంచి నాన్‌వెజ్ వరకు.. దేన్ని ఏ టైమ్‌లో తినకూడదో తెలుసా..?

Updated Date - 2023-03-28T10:22:20+05:30 IST